English | Telugu
క్లైమాక్స్ కి రాజస్థాన్ పొలిటికల్ డ్రామా
Updated : Jul 30, 2020
మరోవైపు, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బీఎస్పీ బుధవారం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశామని, స్పీకర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా తెలిపారు. ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇక, కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ఏం చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఆమోదించడంతో ఇప్పటికే సచిన్ పైలట్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ తమ శిబిర ఎమ్మెల్యేలు ఉంటున్న రిసార్టులను ఒక్కసారిగా మార్చేశారు. అంతేకాకుండా ఆ 19 మంది ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను కూడా మార్చేశారు. అంతేకాకుండా వీరి రక్షణ కోసం రిసార్టు చుట్టూ ప్రైవేట్ బౌన్సర్లను కూడా నియమించుకున్నారు.