English | Telugu
మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... ప్రభుత్వంపై ఫైరవుతోన్న పేదలు...
Updated : Nov 19, 2019
తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కార్పొరేట్ ఆస్పత్రులు మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. కొన్ని ఆస్పత్రుల్లో అయితే ఏకంగా ఆరోగ్యశ్రీ వార్డులనే ఎత్తేస్తున్నారు. ఇన్ పేషంట్లుగా ఉన్న వారికి మాత్రమే సేవలందిస్తున్న హాస్పిటల్స్ ...అవుట్ పేషంట్లను వెనక్కి పంపిస్తున్నాయి. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేవరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి.
తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 832 జబ్బులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 329 కార్పొరేట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద 41వేల 300 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏడాదికి 800కోట్ల రూపాయిలను ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం కేటాయిస్తోంది. అయినా ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటికప్పుడు పెండింగ్ లోనే ఉంటున్నాయి. అయితే, బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఆ దిశగా చర్యలు తీసుకోలేదని హాస్పిటల్ యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం 12వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, కార్పొరేట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడానికి హాస్పిటల్స్ నిరాకరిస్తుండటంతో... ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వెంటనే బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.