English | Telugu
అంధకారంలో ముంబై.. ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం
Updated : Oct 12, 2020
ఇదిలా ఉండగా ముంబైకి విద్యుత్ ను అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన టాటా పవర్ విఫలం కావడమే సమస్యకు కారణమని పశ్చిమ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పవర్ ఫెయిల్యూర్ ఇదేనని, ఈ ఉదయం 10.05కు సమస్య మొదలైందని, మరికాసేపట్లో సమస్య పరిష్కారం కావచ్చని అధికారులు వెల్లడించారు.
ముంబై నగర ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని, సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో విభాగాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలోనే రైళ్లు తిరిగి నడుస్తాయని, ప్రజలు సమస్యను అర్థం చేసుకోవాలని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.
ఇదిలావుండగా, టాటా తరువాత ముంబైకి అత్యధిక విద్యుత్ ను సరఫరా చేస్తున్న అదానీ ఎలక్ట్రిసిటీ స్పందించింది. ప్రస్తుతం అత్యవసర విభాగాలకు కరెంటు సరఫరాను తాము పునరుద్ధరించామని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరింది. కాగా, విద్యుత్ నిలిచిపోగానే, వేలాది మంది సామాజిక మాధ్యమాల్లో తమ కామెంట్లు పెట్టారు. ప్రభుత్వం విఫలమైందని, ఆర్థిక రాజధానిలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎవరి ఇంట్లోనైనా కరెంట్ ఉందా?అని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
టాటా పవర్ వద్ద సమస్య కారణంగా... నగర పశ్చిమ శివారు ప్రాంతాల్లో పవర్ సప్లై చేసే రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌కి కూడా సమస్యలు తలెత్తాయి. టాటా పవర్ వల్ల తమ ట్రాన్స్‌మిషన్ కారిడార్‌కి కూడా కరెంటు సప్లై సమస్యలు తలెత్తినట్లు రిలయన్స్ తెలిపింది. జరిగిన దానికి చింతిస్తున్నాం. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దేందుకు టాటా పవర్ వారితో టచ్‌లో ఉంటున్నాం అని రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఒక ప్రకటనలో తెలిపింది.