English | Telugu

అంబటి రాంబాబుకు సొంత పార్టీ కేడర్ షాక్..

వైసిపి సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ ఇచ్చింది ప్రతిపక్షం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంతకూ అంబటి షాక్ ఇచ్చింది మరెవరో కాదు.. అయన నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ కార్యకర్తలే. సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే తమ ఎమ్మెల్యే మీద హైకోర్టులో పిటిషన్ వేయించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో వారు పిల్ దాఖలు చేశారు.

సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్‌ను హైకోర్టు న్యాయవాది నాగ రఘు వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ పై ఇప్పటికే స్ధానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా ఆ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.

అయితే, అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తె అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.