English | Telugu

దుబ్బాకలో బీజేపీ తరఫున పవన్‌ ప్రచారం!!

దుబ్బాక ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు సైతం తమ పార్టీకి చెందిన అభ్యర్థి కోసం దుబ్బాకలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఉపఎన్నిక ప్రచారపర్వంలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

బీజేపీకి జనసేన మిత్రపక్షం అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి. పవన్ ప్రచారం చేస్తే యువత ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ పెద్దలు ఇప్పటికే పవన్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే, పవన్ ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్చువల్ గా ప్రచారం నిర్వహించే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ పవన్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొని ఉపఎన్నిక ఫలితం బీజేపీకి అనుకూలంగా రాకపోతే అనవసరంగా విమర్శల పాలయ్యే అవకాశముంది. అందుకే పవన్ దుబ్బాకలో ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోవచ్చునని అంటున్నారు.