English | Telugu
విపత్కర తరుణమిది.. అందుకే రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు
Updated : Apr 9, 2020
• రూ. వెయ్యి ఆర్థిక సాయాన్ని వైసీపీ అభ్యర్థులతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి
• పేద ప్రజలకు అండగా నిలుద్దాం... కరోనా నియంత్రణలో ప్రధాని చెప్పిన సూచనలు పాటిద్దాం
• రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్
కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయింది. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు మన పార్టీపరంగా అండగా నిలుద్దాం అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. లాక్ డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలనే అంశంపై ఒక ప్రణాళిక అనుసరిద్దాం అన్నారు. ప్రధాన మంత్రి సూచనలను బాధ్యతాయుతంగా పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెలిపారు.
గురువారం మధ్యాహ్నం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ విస్తృతి, లాక్ డౌన్ పరిణామాలపై పవన్ చర్చించారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు, చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను తెలియచేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవాకార్యక్రమాలను పార్టీ అధ్యక్షులకు తెలిపారు. చేతి వృత్తులవారు, ఆటో డ్రైవర్లు, హాకర్లు ఉపాధికి దూరమై ఆర్థికపరమైన ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా వైరస్ విస్తృతి ఉన్న విపత్కర తరుణం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారులనుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం. పేద కుటుంబాలకు రూ.వెయ్యి పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పంపిణీ చేయించడంపై పీఏసీ సభ్యులు, నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు తమ పరిధిలో చోటుచేసుకున్న ఈ తరహా పంపిణీలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అలాగే వైద్యులకు మాస్కులు, పి.పి.ఈ.లు తగిన విధంగా సమకూర్చని సమస్యపైనా స్పందించాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడంపై శ్రీ తోట చంద్రశేఖర్ గారు సూచనలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా, సోషల్ డిస్టెన్సింగ్, ఇతర నిబంధనలు పాటిస్తూ సేవాకార్యక్రమాల్లో పాల్గొందాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో నాయకులు, జనసైనికులు ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తూ తమ వంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నారు” అన్నారు.
పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కరోనా వైరస్ వ్యాప్తి ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో కాదు అంతర్జాతీయంగా ఉత్పన్నమైన విపత్తు ఇది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రజలకు అవసరమైన భరోసా కల్పించలేకపోతోంది. మంత్రులు కూడా తగిన జాగ్రత్తలు పాటించకుండా పర్యటనలు చేస్తున్నారు. రైతుల సమస్యలు మన దృష్టికి వచ్చాయి. గౌరవనీయ ప్రధానమంత్రి గారు పేద కుటుంబాలకు అండగా ఉండాలి, కనీసం ఒక పేద కుటుంబానికి సాయం చేయండి అని చెప్పారు. మన పార్టీ నాయకులు పలు చోట్ల కూరగాయలు ఇస్తున్నారు. అలాగే విధుల్లో ఉన్న సిబ్బందికీ, పేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎలా అండగా ఉండాలి అనే విషయంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అని పార్టీ అధ్యక్షులు స్పష్టం చెప్పారు. వారు చేసే సూచనలకు అనుగుణంగా నిబంధనలు అనుసరిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలి” అన్నారు.
పి.ఏ.సి. సభ్యులు నాగబాబు మాట్లాడుతూ “ఇది చాలా క్లిష్టమైన సమయం. పేద ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు ఇస్తూ జనసేన కార్యకర్తలు అభినందనీయమైన సేవలు చేస్తున్నారు. రిస్క్ తో కూడుకున్న సమయం ఇది. అయినప్పటికీ మన పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు. వీటిని మరింత పకడ్బందీగా చేయాలి” అన్నారు. వివిధ అంశాలను శ్రీ తోట చంద్రశేఖర్, శ్రీ టి. శివ శంకర్, శ్రీ బొలిశెట్టి సత్య, శ్రీ మధుసూదన్ రెడ్డి, డా. హరిప్రసాద్, శ్రీ బి.నాయకర్, శ్రీమతి పి.యశస్విని తదితరులు కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు.