English | Telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి స‌మాధి క‌ట్టి ఏడాది అవుతోంది

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే.. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అక్రమ నిర్మాణమంటూ కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని వృధా చేశారంటూ.. దీనిపై అప్పట్లోనే విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయింది. ఈ సందర్భంగా ప్రజావేదిక శిథిలాల వద్దకు టీడీపీ నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలనూ అనుమతించబోమని పోలీసులు చెబుతూ.. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

మరోవైపు, ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయిన నేపథ్యంలో.. టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

"ఒక భ‌వ‌నం క‌ట్ట‌డం ఎంతో క‌ష్టం, ఉప‌యోగం. కూల‌గొట్ట‌డం చిటికెలో ప‌ని, తీవ్ర న‌ష్టం. ఇది తెలిసి కూడా విధ్వంసానికే జై కొడుతున్నారు. ఇటువంటివారిని పాల‌కుడిగా ఎన్నుకున్న పాపానికి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌వేదికైన ప్ర‌జావేదిక కూల‌గొట్టి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి స‌మాధి క‌ట్టి ఏడాది అవుతోంది." అని లోకేష్ విమర్శించారు.

"చంద్ర‌బాబు అంటే న‌వ్యాంధ్ర నిర్మాత‌, జ‌గ‌న్‌రెడ్డి అంటే న‌వ్యాంధ్ర నాశ‌నానికి కంక‌ణం క‌ట్టుకున్న అరాచ‌క పాల‌కుడ‌ని ప్ర‌జావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి నిర్మించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జావేదిక‌ని క‌డితే, ఒక్క రాత్రిలో కూల్చేశారు జ‌గ‌న్‌రెడ్డి." అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.