English | Telugu

అర్చకులను చావబాదిన కేసులో ఆలయ చైర్మన్, ఉద్యోగుల అరెస్ట్ 

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార ఆలయంలో అర్చకులను చెర్నాకోలతో చావబాదిన కేసులో ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు నాగరాజు, ఈశ్వరయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా కార్తీక పౌర్ణమి ఆదివారం రాత్రి ఆలయ ఆవరణలో అటెండర్ ఈశ్వరయ్య టికెట్లు విక్రయిస్తుండాన్ని అర్చకుడు సుధాకరయ్య, ఆయన కుమారులు చక్రపాణి, మృగపాణి ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ తోపులాటలో కిందపడిన అటెండర్ ఈశ్వరయ్య వెళ్లి ఆలయ కమిటీ చైర్మన్, వైసీపీ నాయకుడు అయిన ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతాప్‌రెడ్డి, ఆలయ సూపర్‌ వైజర్ నాగరాజు, మరో ఇద్దరితో కలిసి వచ్చీ రావడమే పూజారులపై చెర్నాకోల తో దాడిచేయగా, ఆయనతో కూడా వచ్చినవారు కర్రలతో అర్చకులను వెంబడించి మరీ కొట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చక్రపాణి గుడిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు.

ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న నిందితులు ప్రతాప్‌రెడ్డి, నాగరాజు, ఈశ్వరయ్యలను అరెస్ట్ చేశారు. ఈ దౌర్జన్య ఘటనపై అటు అర్చక సంఘాల నుండి ఇటు భక్తుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి విచారణకు ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ రీజినల్ కమిషనర్ వెంకటేష్, ఏసీ ఆదిశేష నాయుడు ఓంకార ఆలయానికి చేరుకొని అర్చకులతో విడివిడిగా విచారణ జరిపి తమ నివేదికను సిద్ధం చేసి దేవాదాయ కమిషనర్‌కు పంపుతున్నట్లు విలేకరులకు తెలిపారు. అయితే తమకు న్యాయం జరగకుంటే ఉరివేసుకుంటామని బాధిత పూజారులు సుధాకరయ్య, ఆయన కుమారులు విచారణకు వచ్చిన అధికారుల కారుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేసారు. దీంతో దిగి వచ్చిన అధికారులు దాడికి పాల్పడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని, పాలకమండలి రద్దు, ఈవో మోహన్ సస్పెన్షన్ కోరుతూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మరోపక్క ఈ ఘటన పై బ్రాహ్మణ సంఘాలు వినూత్న పద్దతిలో తమ నిరసన వ్యక్తం చేసాయి. కర్నూల్ లో ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పేరిట పిండ ప్రధాన కార్యక్రమం చేసి తమ నిరసన వ్యక్తం చేసారు.