English | Telugu
తెలంగాణ ప్రజలపై బాదుడే బాదుడు... పైసలు కోసం పన్నులు పెంపు...
Updated : Dec 21, 2019
ఆర్ధిక మాంద్యం ప్రభావం తెలంగాణ ఖజానాపై తీవ్రంగా పడింది. ఆర్ధిక మాంద్యం కారణంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందున దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఇక, జీఎస్టీ వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా సక్రమంగా అందడం లేదు. మరోవైపు కేంద్రం నుంచి అందాల్సిన గ్రాంట్లు, నిధులు, బకాయిలూ విడుదల కావడం లేదు. దాంతో, మరో రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.
అయితే, ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడానికి ఛార్జీలను పెంచిన కేసీఆర్ సర్కారు.... ఆ తర్వాత లిక్కర్ పై బాదుడు బాదింది. అలాగే ప్రభుత్వరంగ సంస్థ పాల ధరలనూ పెంచింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏటా 800కోట్ల భారం వేయగా, ఇక మద్యం ధరల పెంపుతో ఏకంగా 4వేల కోట్లకు పైగా వడ్డించి మందుబాబులకు చుక్కలు చూపించింది. అయితే, ఇదే దారిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్ర పరిధిలో ఉండే వివిధ పన్నులను కూడా పెంచాలని చూస్తోంది.
ఇక, అన్నింటికంటే ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. విద్యుత్ సంస్థలు ఇప్పటికే భారీ అప్పుల్లో ఉండటంతో వాటిని భర్తీ చేయాలంటే ఛార్జీల పెంపు తప్పదని అంటున్నారు. దాంతో, సామాన్యులపై మరింత భారం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే, విద్యుత్ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో వ్యతిరేకత రాకుండా పారిశ్రామిక, కమర్షియల్ కనెక్షన్స్ పైనే ఎక్కువ బాదుడు ఉంటుందని అంటున్నారు. ఇక, పన్నుల పెంపు ద్వారా దాదాపు పది వేల కోట్ల రూపాయలను టార్గెట్ గా పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.