English | Telugu
నేను ఆ బ్యాచ్ కాదు.. రోజాకి లోకేష్ కౌంటర్
Updated : Dec 11, 2019
టీడీపీ నేత నారా లోకేష్... వైసీపీ నేత రోజాకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రోజా అయితే.. సొంత కొడుకుని గెలిపించుకోలేని.. చేతకాని, దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు మిగిలిపోయారు.. ఇప్పుడు ఆయనకు అసలు జగన్ గారిని అనే అర్హత లేదంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. మాట్లాడితే నా ఓటమిని ప్రస్తావిస్తూ చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే బ్యాచ్ కాదు. నేను కావాలనుకుంటే మా నాన్న గెలిచిన కుప్పం నుంచి పోటీ చేసి.. నేను గెలిచానని కాలర్ ఎగరేయొచ్చు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఎక్కడైతే టీడీపీ బలంగా లేదో అక్కడ పోటీ చేసి గెలవాలి అనుకున్నా. మంగళగిరిలో 1985 నుండి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే అక్కడ పోటీ చేసి గెలిచి చరిత్ర తిరగరాయాలనుకున్నా. ఆ దిశగా పని చేశా. కానీ ఓటమి ఎదురైంది. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని లోకేష్ వ్యాఖ్యానించారు.