English | Telugu

వేధింపులతో మింగేస్తున్నారు! వైసీపీపై నారా లోకేష్ ఫైర్ 

నంద్యాల అబ్దుల్ సలాం ఘటనపై మరోసారి తీవ్రంగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. వేధింపులకు గురిచేసి అబ్దుల్ సలాం కుటుంబాన్ని మింగేశారని మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యుల ఇంటికి పోలీసులను పంపి భయపెడుతున్నారని, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా? అని ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ ప్రశ్నించారు. బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అబ్దుల్ సలాం కుటుంబం సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ వద్ద సలాం కుటుంబసభ్యులు వాపోయిన వీడియోను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మరోవైపు అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం నంద్యాల కోర్టులో విచారణ జరుగనుంది. బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు రివిజన్ పిటిషన్ వేశారు. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదుచేశారు. నిందితులు సోమశేఖర్‌రెడ్డి, గంగాధర్‌కు నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులు బెయిల్ పిటిషన్ వేయగా ..ఇద్దరికి నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులంతా సూసైడ్ చేసుకోవడానికి కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు వెంటనే బెయిల్ రావడంపై విమర్శలు వచ్చాయి. దీంతో బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.