English | Telugu

అచ్చెన్నాయుడికి జగన్ ప్రభుత్వ సలహాదారు సంచలన ఆఫర్..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని మూడు రోజుల క్రితం ఎసిబి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ అరెస్ట్ పై పలువురు టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలతో విరుచుకు పడ్డారు. అచ్చెన్న కుటుంబం మొత్తం వైసిపిలో చేరితే 50 కోట్లు ఇస్తామని సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు ఆఫర్ చేసింది నిజం కాదా అని లోకేష్ వైసిపిని సూటిగా ప్రశ్నించారు. ఆ ఆఫర్ కు లొంగకపోవడంతో కక్ష కట్టి అచ్చెన్నాయుడు ని ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి వేధిస్తున్నారని మండి పడ్డారు. లోకేష్ ఈ రోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్నిపరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అన్నీ రాసుకుంటున్నామని.. బదులు తీర్చుకుంటామని అయన వైసిపిని హెచ్చరించారు. దొంగ కేసులు పెడితే తాము భయపడబోమని.. జగన్ తమను ఏమీ చేయలేరని అయన స్పష్టం చేశారు.

వ్యాపార రంగం లో ఉన్న టీడీపీ నేతలను అధికారం అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టి.. బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని, ఏ వ్యాపారాలు లేని వారిని డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని అయన విమర్శించారు. తాజాగా సిద్దా రాఘవరావు విషయం లో ఇదే జరిగింది. పార్టీలో చేరేవరకు గ్రానైట్ ఎక్స్ పోర్ట్ అనుమతి నిలిపి వేసిన జగన్ ప్రభుత్వం అయన పార్టీ తీర్థం పుచ్చుకున్న మరు క్షణం అనుమతులు ఇచ్చేసారు.

మాకేం కాలేదులే అని ప్రజలు చూస్తూ ఊరుకుంటే త్వరలో గజదొంగలు ప్రజలపై పడతారని లోకేష్ హెచ్చరించారు. పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ తనలాగా అందర్నీ జైలుకు పంపించాలనుకుంటున్నారని అయన మండిపడ్డారు. జగన్ తప్పు చేశారు కాబట్టి బెయిల్ కూడా రాక పదహారు నెలలు జైల్లో ఉన్నారని లోకేష్ విమర్శించారు. వైసిపి ఎన్నిఅరాచకాలు చేసినా తమ మనో స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన స్పష్టం చేశారు. తాజాగా అచ్చెన్నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారనే విషయం బయటకు రావడం రాజకీయంగా కలకలం రేపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.