English | Telugu
నీట మునిగిన జిల్లా పరిషత్ ఆఫీసు.. భవనంలోకి పాములు, తేళ్లు!!
Updated : Nov 11, 2019
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఆఫీసు నీట మునిగింది. చెరువు శిఖం భూమిలో నిర్మించటంతో భవనం చుట్టూ మోకాలు లోతు నీరు చేరింది. చౌడు భూముల్లో నిర్మించడంతో ఎప్పుడు కుప్పకూలుతుందోనని భయపడుతున్నారు జడ్పీ సిబ్బంది. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఈ ఏడాది కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా పరిషత్ భవనాన్ని ఉయ్యాలవాడ గ్రామం దగ్గరలో కేసరి సముద్రం చెరువు పరిసరాల్లో నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభించడంతో కృష్ణా జలాలు నాగర్ కర్నూల్ కేసరి సముద్రంలో చేరాయి. దీంతో భవనాల చుట్టూ నీళ్లు చేరాయి. జడ్పీ భవనం నీటిలో ఉండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని ఆఫీస్ కు వస్తున్నారు. నీటిముంపుతో భవనంలోకి ప్రమాదకరమైన పాములు.. తేళ్లు చేరుతున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు సిబ్బంది.
నాగర్ కర్నూల్ పట్టణానికి దూరంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో జిల్లా పరిషత్ ఆఫీసు ఏర్పాటు చేయటం జనానికి ఇబ్బందిగా మారింది. చెరువు పరిసరాల్లో జడ్పీ ఆఫీసు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా మారింది. జిల్లా పరిషత్ తొలి సమావేశాన్ని కూడా ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరుపుకున్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాల్సిన భవనం ఎక్కడో దూరంగా ఊరి నుండి వెలివేసినట్టుగా ఉంది. జిల్లాలోనే పెద్దదైన కేసరి సముద్రం చెరువు శివారులో దాదాపు 200 ఎకరాల భూమి ఆక్రమణ పాలైంది. ఎండమెట్ల పరిసరాల్లో ఆక్రమించిన భూముల్లో గెస్ట్ హౌస్ లు ఫంక్షన్ హాల్స్ నిర్మించటంతో పాటు వెంచర్ వేసి ప్లాట్లుగా మార్చారు. ప్రజావాణిలో చెరువు అక్రమాలకు అడ్డాగా మారిందని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు రైతులు. ఆక్రమణల వల్ల చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గిపోయి ఆనకట్టు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటున్నారు.అధికారుల నిర్లక్ష్యం.. ముందు చూపు లేకపోవడంతో జిల్లా పరిషత్ భవనం ఎందుకూ పనికి రాకుండా పోయిందని అంటున్నారు స్థానికులు.