English | Telugu
వలస కూలీల పిల్లలకు ఆహారంగా అంగన్ వాడీ పాలు, గుడ్లు!
Updated : Mar 28, 2020
వలస కూలీలు నివాసముంటున్న నివాస ప్రాంతాలకు వెళ్లి అక్కడ వారి ఆరోగ్య పరిస్థితులు, భోజన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న కూలీల పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల నుంచి పాలు, గుడ్లు, ఆహార పదార్థాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి కేంద్రం తరపున, ఆయా రాష్ట్రాల తరపున వచ్చే వసతులన్ని అందేలా చూడాలని కలెక్టర్ వి.పి గౌతమ్ కు చెప్పారు.
వచ్చే నెల 15వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడికి కదిలే పరిస్థితి లేనందున ఇక్కడ పనిచేస్తున్న వలస కూలీలకు ఒక్క పూట కూడా తిండి దొరకని పరిస్థితి ఉండొద్దని, కనీస వసతులకు లోటు కలగవద్దని అధికారులకు, స్థానిక నేతలకు ఆదేశాలిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానికులకు ఇబ్బందులు రాకుండా నెలకు 12 కిలోల రేషన్ బియ్యం, 1500 రూపాయలు ఇస్తున్నామని, స్థానికంగా అన్ని వసతులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కరోనా వైరస్ నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని, ఇందుకోసం ప్రభుత్వం యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోందని, డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. అయితే కొంతమంది ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి రోడ్ల మీదకు వస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
ఈరోజు లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించడం కోసం దాతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వారి వేతనాలు, నియోజక వర్గ నిధులను కూడా సిఎం సహాయ నిధికి ఇచ్చారన్నారు. ఈ విరాళాలతో ప్రభుత్వం మరిన్ని వైద్య సేవలు కల్పిస్తోందని, నివారణ చర్యలు మరింత పటిష్టంగా అమలు చేయగలుగుతుందన్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటి వరకు మందు లేదని, దీనికి స్వీయ నియంత్రణే ప్రజలకు శ్రీరామ రక్ష అని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలని కోరారు.