English | Telugu

మేడారం జాతరకు ఎలా వెళ్లాలి? రూట్ మ్యాప్ మీ కోసం..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు ప్రారంభమైంది. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ మీకోసం....

----హైదరాబాద్ నుంచి-----

హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు... భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు, పసర, తాడ్వాయి మీదుగా లేదా పసర నుంచి నార్లపూర్ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. మేడారం జాతరకు ఇదే ప్రధాన రహదారిగా చెబుతున్నారు.

----కరీంనగర్ నుంచి----

కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే భక్తులు ...హుజూరాబాద్‌, పరకాల, ములుగు, పసర, నార్లపూర్‌ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. అలాగే, కరీంనగర్‌ నుంచి మరో దారిలో కూడా మేడారం చేరుకోవచ్చు.... పెద్దపల్లి, మంథని, కాటారం, భూపాలపల్లి, బయ్యక్కపేట మీదుగా జంపన్న వాగు సమీపానికి చేరుకోవచ్చు.

----ఖమ్మం నుంచి----

మరోవైపు ఖమ్మం వైపు నుంచి వచ్చే భక్తులు.... భద్రాచలం మంగపేట లేదా వాజేడు, వెంకటాపురం మీదుగా ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా మేడారం రావొచ్చు.

----విజయవాడ నుంచి-----

ఇక, విజయవాడ నుంచి వచ్చే భక్తులు నందిగామ, ఖమ్మం, ఇల్లందు, పసర, నార్లపూర్‌ మీదుగా జాతర ప్రాంగణానికి చేరుకోవచ్చు.

----ఛత్తీస్ గఢ్ నుంచి----

అలాగే ఛత్తీస్‌గడ్‌ నుంచి వచ్చే భక్తులు.... వాజేడు గోదావరి బ్రిడ్జి మీదుగా ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారం జాతరకు రావాల్సి ఉంటుంది.

----మహారాష్ట్ర నుంచి----

ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు... కాళేశ్వరం బ్రిడ్జి మీదుగా మహాదేవపూర్, గారెపల్లి, నార్లపూర్‌ మీదుగా గద్దెల దగ్గరకు రావొచ్చు.

----రైలు ప్రయాణికులు----

ఇక, రైలు ప్రయాణికులైతే వరంగల్‌ లేదా కాజీపేట స్టేషన్లలో దిగి అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకోవచ్చు.

అయితే, రద్దీ దృష్ట్యా ములుగు నుంచి నార్లాపూర్ మధ్య పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు. అలాగే, హన్మకొండ, ములుగు, పసర, తాడ్వాయి రూట్లో వన్ వే ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేప్పుడు నార్లాపూర్, బయ్యక్కపేట, ఘనపురం మీదుగా పరకాల, గుడెప్పహాడ్ వరకు వన్ వే కింద మార్చారు. ఇక, సొంత వాహనాల్లో వచ్చేవాళ్ల కోసం జంపన్నవాగు దగ్గర 10 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ్నుంచి గద్దెల దగ్గరకు వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవాళ్ల కోసం గద్దెలకు చేరువలో ప్రత్యేకంగా స్టాపులను ఏర్పాటు చేశారు.