English | Telugu

అవి కరోనా కిట్లా.. టీబీ కిట్లా...

విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి రాపిడ్ కరోనా నిర్ధారణ కిట్స్ తయారు అయ్యాయి అని ప్రస్తుతానికి 1000 కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు. ఈ కిట్స్ తో కేవలం 55 నిమిషాల్లోనే వ్యాధినిర్ధారణ జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఈ కిట్స్ ను ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆవిష్కరింప చేశారు.

మొత్తం వ్యవహారంలో దాగున్న అసలు విషయమేంటి? అసలు విశాఖలో ఉన్న మెడ్ టెక్ జోన్లో కరోనా నిర్ధారణ కిట్స్ తయారు చేసే సామర్ధ్యమున్న కంపెనీలు ఉన్నాయా? అందుబాటులోకి తెచ్చాము అని చెప్తున్న ఈ కిట్స్ ఇక్కడ తయారు అయినవేనా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నాధుడు లేడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం మాల్ బయో సంస్థ బెంగుళూరు నుంచి కిట్స్ తయారీకి అవసరమైన విడి భాగాలను దిగుమతి చేసుకుని మెడ్ టెక్ జోన్ లోని త్రీడీ ప్రింటింగ్ లాబొరేటరీలో పాక్షికంగా మార్పులు చేసి తిరిగి బెంగుళూరు పంపించి, అక్కడ కొన్ని అవసరమైన మార్పులు చేర్పులు చేసి మరలా గోవా చేర్చి అక్కడ పూర్తిస్థాయిలో కిట్స్ గా మార్చిన తర్వాత, మరోసారి బెంగుళూరులో టెస్టింగ్ జరిగిన తదుపరి చివరిగా మెడ్ టెక్ జోన్ కు చేరుకొని ఇక్కడే తయారు అవుతున్నట్టుగా చూపబడుతున్నాయి. ఈ మొత్తం కిట్స్ తయారీ వ్యవహారంలో మెడ్ టెక్ జోన్ పాత్ర కేవలం 15 శాతం మాత్రమె. ఈ పనిని కూడా మెడ్ టెక్ జోన్ లోని అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది చేయడం గమనార్హం.

కొద్ది రోజుల క్రితం మాల్ బయో సంస్థ తయారు చేసిన కరోనా నిర్ధారణ కిట్స్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ తిరస్కరించింది. అందుకోసం బెంగుళూరు మెడికల్ కాలేజీలోని విక్టోరియా హాస్పటల్ ద్వారా ఈ కిట్స్ కరోనా నిర్ధారణకు పనికొస్తాయని సర్టిఫికేట్ ఇప్పించుకున్నారు. కానీ విక్టోరియా మెడికల్ కాలేజీ ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.

మెడ్ టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ గతంలో ఈ మాల్ బయో సంస్థకు ఆంధ్రప్రదేశ్ లో టీబీ నిర్ధారణ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. వాటినే కొంచం అభివృద్ధి చేసి కరోనా నిర్ధారణ కిట్స్ గా వాడుతున్నారు. ఈ విషయాన్ని మొన్న ముఖ్యమంత్రి ఆవిష్కరించిన కిట్లమీద 2019లో తయారు చేసినట్టుగా ముద్రించి ఉండడం స్పష్టం చేసింది కూడా.

మాల్ బయో సంస్థకు మెడ్ టెక్ జోన్లో ఎటువంటి తయారీ యూనిట్ లేకపోవడం విశేషం. పూర్తిగా గోవా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడే తయారు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎవరైనా మెడ్ టెక్ జోన్ ను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తే కళ్ళకు కట్టినట్టు కనపడతాయి.

ఏపీ మెడ్ టెక్ జోన్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకూ ఒక్క కంపెనీ కూడా పూర్తి సామర్ధ్యంతో వైద్య పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పలేదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా మెడ్ టెక్ జోన్లో ఇంతవరకూ ఉనికి కూడా లేని మాల్ బయో సంస్థ ఇక్కడ కరోనా నిర్ధారణ కిట్స్ తయారు చేస్తోందని చెప్పడం దేనికి సంకేతం.

ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న మెడ్ టెక్ జోన్ మరియు ప్రస్తుత సిఈఓ & ఎండీ, పూర్వపు ఏపీ ఆరోగ్య సలహాదారు జితేంద్ర శర్మ ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో కూడా మరో కుంబకోణానికి తెరలేపారని ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యం అత్యంత ప్రమాదంలో ఉన్న ఇలాంటి సమయంలోనూ వీరు అవకాశాలను వెతుక్కోవడం మంచిది కాదంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ ద్వారా మాల్ బయో అనే సంస్థకు కరోనా నిర్ధారణ కిట్స్ తయారు చేసె బాధ్యత అప్పగించింది. వాళ్ళు కిట్స్ అందించడం మొదలుపెట్టారు. ఈ కిట్స్ ద్వారా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంపిల్స్ ను మరలా ఎపీలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన 4 ల్యాబ్స్ కు కానీ, పూణే లోని ల్యాబుకు కానీ పంపించి మరోసారి పరీక్ష జరిపించినట్లయితే ఈ మాల్ బయో సంస్థ అనిదించిన కిట్స్ పనితీరు తెలుసుకునే ఆస్కారం ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.