English | Telugu

కవితకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని టి.ఆర్.ఎస్ అప్పగించనుందా..?

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎంపీ కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న కవిత ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అలాంటి కవిత తాజాగా బతుకమ్మ ఉత్సవాలతో మళ్లీ తెరపైకి వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతి సంస్థ కమిటీలను రద్దు చేసి కార్యక్రమాలను ఆపేసిన కవిత ఇప్పుడు మళ్లీ జాగృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత రెండేళ్లుగా జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమానికి కూడా హాజరు కాని కవిత ఈ సారి మాత్రం జాగృతికి అన్నీ తానై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో అటు జాగృతి ఇటు కవిత పోషించిన కీలక పాత్రను వివరించేలా మంత్రులతో వీడియోలు విడుదల చేయిస్తున్నారు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను కవిత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడడం చూస్తుంటే త్వరలోనే టీ.ఆర్.ఎస్ లో ఆమెకు ముఖ్య బాధ్యతలు అప్పగిస్తారని చర్చ గులాబీ శ్రేణుల్లో జోరందుకుంది.

రెండో సారి టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించారు. మొన్నటివరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ కు ఇటీవల కేబినెట్ లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ సూచనల మేరకే కవిత జాగృతిని యాక్టివ్ చేస్తున్నట్లు వినికిడి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల ముందుకు రాని కవితను మళ్లీ ప్రమోట్ చేసేందుకు టీ.ఆర్.ఎస్ వర్గాలు గట్టిగానే రంగంలోకి దిగాయని పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

మంత్రిగా కేటీఆర్ ప్రభుత్వ పాలనపై ఫోకస్ పెట్టారు, ఇటు ప్రభుత్వం అటు పార్టీ చూసుకోవడం కేటీఆర్ కు కత్తిమీద సాములా మారుతుంది. అందుకే పార్టీ బాధ్యతలు చూసేందుకు కవితను రంగంలోకి దింపడం ఖాయమని కొందరు ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కవితకు కట్టబెట్టవచ్చన్న భావన గులాబి వర్గాల్లో ఏర్పడింది.