English | Telugu
బీజేపీ నేతలు ఈ విషయాన్ని మరిచినట్టున్నారే!!
Updated : Sep 10, 2020
తాజాగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో అనేక దేవాలయాలను కూలగొట్టారని అన్నారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక ఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని చెప్పడం దారుణమని.. మతిస్థిమితం లేని వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, గత ప్రభుత్వం హయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్మించాలని కన్నా డిమాండ్ చేశారు.
కన్నాతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంతో పాటు గత టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరి తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు.. బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద విమర్శలు చేస్తూ తమని తామే నిందించుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో 2018 వరకు బీజీపీ కూడా భాగస్వామిగా ఉంది. అంతేకాదు, అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా దివంగత బీజీపీ నేత మాణిక్యాలరావు పనిచేశారు. దీంతో ప్రస్తుతం కొందరు బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే పరోక్షంగా తమని తామే నిందించుకున్నట్టు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.