English | Telugu

కల్లు తాగితే 5వేలు జరిమానా... 25 చెప్పు దెబ్బలు...

తెలంగాణలో ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇఫ్పుడు సంచలనంగా మారింది. తమకు చెప్పకుండా తమను సంప్రదించకుండా కల్లు రేట్లు పెంచేశారన్న అక్కసుతో, ఆ గ్రామ పెద్దలు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం తెలంగాణ అంతటా తీవ్ర కలకలం రేపుతోంది.

నిన్నమొన్నటివరకు ఐదు రూపాయలకు అమ్మే కల్లు సీసాను... గౌడ వ్యాపారులు పది రూపాయలకు పెంచారు. ఒక్క బొల్లారం గ్రామంలోనే కాకుండా నాగిరెడ్డిపేట మండలం అంతటా ఇది అమల్లోకి వచ్చింది. అయితే, తమను సంప్రదించకుండా కల్లు రేట్లు పెంచారన్న ఆగ్రహంతో.... గ్రామంలో ఎవరైనా కల్లు తాగితే 25 చెప్పు దెబ్బలు... 5వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ పెద్దలు తీర్మానం చేశారు. అంతేకాదు ఊరంతా చాటింపు వేయించారు. అలాగే, కల్లు డిపోల దగ్గర చెప్పుల దండలు కట్టి అమానుషంగా వ్యవహరించారు.

అయితే, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, కల్లు డిపోల దగ్గర చెప్పుల దండలను తీయించారు. అయితే, గ్రామ పెద్దల తీరుపై గౌడ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని ధరలు పెరగడంతోనే స్వల్పంగా రేట్లు పెంచామని, కానీ గ్రామంలో ఎవరూ కల్లు తాగొద్దంటూ ఆంక్షలు విధించారని, ఎవరైనా కల్లు తాగితే చెప్పు దెబ్బలు, జరిమానా విధిస్తామని హెచ్చరించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. కల్లు డిపోలను తాము దేవాలయాలుగా భావిస్తామని, కానీ గ్రామస్తులు చెప్పుల దండలు కట్టి తమను అవమానించారని వాపోతున్నారు.

కల్లు డిపోలకు చెప్పుల దండ కట్టడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బొల్లారం గ్రామస్తుల నిర్వాకం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.... సమగ్ర విచారణకు ఆదేశించింది. దాంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కల్లు వివాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో... అరెస్టులు చేస్తారేమోనని బొల్లారం గ్రామస్తులు వణికిపోతున్నారు.