English | Telugu

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా..!

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి అయన సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం ను కలిసి రాజీనామా లేఖను ఇచ్చారు. రామచంద్రమూర్తి నాలుగైదు నెలల కిందటే రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పట్లో ఎందుకో సైలెంటయిపోయారు. తాజాగా ఇప్పుడు హఠాత్తుగా అయన తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి ఇచ్చారు.

గతంలో సీఎం జగన్ మీడియాలో డైరక్టర్‌గా పని చేసిన ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ప్రభుత్వ పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా సీఎం జగన్ నియమించి మంచి జీతభత్యాలతో కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. అయితే.. తనకు ఏమీ పని మాత్రం ఉండటం లేదని అంతేకాకుండా ముఖ్యమంత్రి పాలనాపరమైన, విధాన నిర్ణయాలు తీసుకునే సమావేశాలకు ఆయనకు సమాచారం కూడా ఉండటం లేదని దీంతో అసంతృప్తికి గురైన అయన గతంలోనే రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి.

ఏపీ ప్రభుత్వంలో సలహాదారులుగా నియమితులైన వారిలో కేవలం ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారు ఉత్సవ విగ్రహాల లాగా మిగిలారని వార్తలు వస్తున్నాయి. ఈ ఒకరిద్దరు సలహాదారులు మాత్రమే అందరి బదులు సీఎం కు సలహాలు ఇస్తూంటారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలా ఉండటం ఇష్టం లేక రామచంద్రమూర్తి రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.