English | Telugu

వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే కుమారుడు

జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ మద్దతుగా నిలుస్తున్న రాపాక వరప్రసాద్ మరో అడుగు ముందుకేశారు. తమ కుమారుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అయితే జనసేన కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు రాపాక వరప్రసాద్. వైసీపీకి పూర్తి అనుకూలంగా ఉంటున్నా ఆయన పార్టీ మాత్రం మారలేదు. సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేగా కొనసాగనున్న రాపాక వరపస్రాద్ పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకే అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోవడం లేదని చెబుతున్నారు.