English | Telugu

జ‌గ‌న్ గేమ్ ప్లాన్‌!?

అన‌గ‌న‌గా ఒక కూట‌మి. పెద్ద కూట‌మి. అధికార కూట‌మి. అయినా ఒక‌రిద్ద‌రు ఒక‌రిత‌ర్వాత మ‌రొక‌రు నిష్ర్క‌మించారు. అయినా కూట‌మి కంగారు ప‌డ‌లేదు. నింపాదిగా న‌డుస్తున్న‌ది. కొత్త‌గా ఎవ‌ర్న‌యినా చేర్చుకోవాల‌నుకుంటే అది కూట‌మి నిర్ణ‌యించుకుంటేనే అవుతుంది. అధికార కూట‌మి కాబ‌ట్టి అందులో చేరాల‌ని ఆశించేవాళ్లు మిక్కిలిగానే ఉంటారు. కాని అది చేరాల‌నుకునేవారి ఇష్టాయిష్టాల మీద ఉండ‌దు. కూట‌మి ఆలోచ‌న‌ను బ‌ట్టి ఉంటుంది. తాజాగా ఒక ప్రాంతీయ పార్టీ అందులో భాగ‌స్వామి కావాల‌ని అనుకుంటున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. మ‌రి ఈ క‌థ కంచికి ఎలా చేరుతుంది?

నిజానికి ఇది అన‌గ‌న‌గా ఒక క‌థ కాదు. ఆ కూట‌మి మ‌రేదో కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే. ఆ ప్రాంతీయ పార్టీ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైసీపీ. ఈ వారం ఆరంభంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. దీన్ని కేవ‌లం ప్ర‌చారం అని కొట్టేయ‌డానిక్కూడా త‌గిన ఆధారాల్లేవు. ఎందుకంటే..ఆయ‌నంత ఆగ‌మేఘాల మీద ఢిల్లీ వెళ్లాల్సివ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రి కోరుకున్నారు కాబ‌ట్టి జ‌గ‌న్ అలా హ‌ఠాత్తుగా ఒక్క రోజు ముంద‌స్తు స‌మాచారంతో వెళ్ల‌గ‌లిగారు. అదేరోజు మ‌ధ్యాహ్నం రెండు తెలుగు రాష్ట్రాల జ‌ల వివాదం మీద అపెక్సు కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఉభ‌య రాష్ట్రాల సీఎంలు వారివారి రాజ‌ధాని న‌గ‌రాల నుంచి, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్ ఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సి ఉంది. తీరా ప్ర‌ధానితో భేటీ కార‌ణంగా ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో త‌న నివాసం నుంచి వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు. దీన్నిబ‌ట్టి ప్ర‌ధానితో భేటీలో ఒక మ‌ర్మం ఉంద‌న్న ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతున్న‌ట్టే భావించాలి.

ఆ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఎవ‌రి ప్రోద్బ‌లం మీద జ‌రిగింద‌న్న‌ది ఒక అంశం. అపెక్సు కౌన్సిల్ స‌మావేశానికి రెండు రోజుల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. అదంతా స‌హ‌జంగానే తెలంగాణ వాద‌న‌కు బ‌లం చేకూర్చే విధంగా ఉంది. ఆత‌ర్వాతే జ‌గ‌న్‌-మోడీ భేటీ ఖ‌రారైంది. అంటే..అపెక్సు కౌన్సిల్ భేటీకి ముందుగానే జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీని క‌లిసి జ‌ల వివాదంలో ఆంధ్రా వాద‌న‌ను బ‌లంగా వినిపించి అపెక్సు కౌన్సిల్ స‌మావేశంలో త‌మ వాద‌న‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌నుకున్నారా? అందుకోసం పీఎంఓ ద్వారా ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? ఇదీ ఒక అంశ‌మే. కేసీఆర్ లేఖ‌కు మోడీతో భేటీ ఒక స‌మాధాన‌మ‌న్న మాట‌! అయితే ఏపీలో ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఈ వాద‌నేదీ బ‌లంగా చ‌ర్చ‌కు నోచుకోలేదు. కేవ‌లం ఎన్డీయేలో చేరే విష‌య‌మై చ‌ర్చ‌ల‌కు పిలిచిన‌ట్టుగానే ఎక్కువ ప్ర‌చారానికి నోచుకుంది. అయితే ఆ భేటీ అయ్యాక ఏవైపు నుంచీ అందుకు సంబంధించిన స‌మాచార‌మేదీ అధికారికంగా గాని, విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ‌న్న‌ట్టు గాని బైటికి రాలేదు. దీన్నిబ‌ట్టి అస‌లు ఈ అంశంలో ఎన్డీయే అభిప్రాయ‌మేమిటి అన్న సందేహాలు తెర‌మీదికొచ్చాయి.

ఎన్డీయే నుంచి ఈమ‌ధ్యే శిరోమ‌ణి అకాలీద‌ళ్ వైదొలిగిన మాట నిజ‌మే. అంత‌మాత్రాన ఇప్ప‌టికిప్పుడు ఆ శూన్యాన్ని భ‌ర్తీ చేసుకోవాల‌న్న ఆదుర్దా ఆ కూట‌మికేమీ లేదు. అలాంటి వాతావ‌ర‌ణం కూడా క‌నిపించ‌డం లేదు. కాని వైసీపీకి ఎన్డీయే నుంచి సిగ్న‌ల్ అందుతున్న‌ట్టు అంటున్నారు.వైసీపీ మాత్రం ప్ర‌త్యేక హోదా ఇస్తేనే చేర‌తామ‌ని ప్ర‌ధానితో భేటీలో కూడా చెప్పిన‌ట్టు ఒక ప్ర‌చారం జ‌రిగింది. అందుకు ఎన్డీయే నుంచి..హోదా ఇవ్వ‌లేము గ‌న‌క‌..అందుకు త‌గిన‌ట్టు ప్యాకేజీ ఇస్తామ‌ని రాయ‌బారాలు సాగుతున్న‌ట్టు మ‌రొక క‌థ‌నం. అస‌లీ క‌థ‌నాలు అటు ఎన్డీయేతో గాని, ఇటు వైసీపీతో గాని సంబంధం లేకుండానే న‌డుస్తున్నాయా అన్న అనుమానాలూ క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఒక‌వేళ ఎన్డీయేలో చేరాల‌నుకునే ఏ పార్టీ అయినా..మోడీ ముందు, అమిత్ షా ముందు ష‌ర‌తులు పెట్టేంత వాతావ‌ర‌ణం ఉందా? ఆ ప‌రిస్థితి ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందా? ఇలాంటి సంద‌ర్భాల్లో ఉభ‌యుల ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఒప్పందాలు కుద‌ర‌డం స‌హ‌జ‌మే. ఇరువైపులా వ‌త్తిళ్లు ఉన్న‌ప్పుడే ఇలాంటివి జ‌రిగే వీలుంది. వైసీపీ ష‌ర‌తులు పెట్ట‌డం..ఎన్డీయే వాటిమీద బేర‌సారాలు ఆడ‌టం..ప్ర‌స్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణానికి పొస‌గ‌ని అంశాలుగా క‌నిపిస్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకి బ‌లం త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి, బిల్లుల విష‌యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు భాగ‌స్వాముల్ని చేర్చుకోవ‌చ్చున‌న్న ఒక‌ప్ప‌టి వాద‌న‌లకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. మొన్నీమ‌ధ్యే చూశాం. క‌రోనా నేప‌థ్యంలో అర‌కొర స‌భ్యుల మ‌ధ్య వ్య‌వ‌సాయ బిల్లుల్ని ప్ర‌భుత్వం క‌నీస లాంఛ‌నాలైనా పాటించ‌కుండా ఆమోదింప‌చేసుకోవ‌డాన్ని క‌ళ్లారా చూశాక కూడా రాజ్య‌స‌భ‌లో బ‌లం కోసం కొత్త‌వారిని కూట‌మిలో చేర్చుకోవ‌డంలాంటిది జ‌రుగుతుంద‌ని భావించ‌గ‌ల‌మా? ఏతావాతా అలాంటి ప్ర‌తిపాద‌నేదైనా ఉంటే..అది వ‌చ్చే అసెంబ్లీ..పార్ల‌మెంటు ఎన్నిక‌ల కోస‌మే అవుతుంది త‌ప్ప వేరే కార‌ణాల కోసం మాత్రం కాదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఇంకా ఇంకా బ‌ల‌హీన‌ప‌రిచి, క‌నుమ‌రుగు చేస్తేనే అటు బీజేపీకి గాని, ఇటు వైసీపీకి గాని ప్ర‌శాంత‌త ఉండ‌ద‌న్న‌ది నిజం. ఇక్క‌డ ఈ ఇద్ద‌రి ఉమ్మ‌డి శ‌త్రువు తెలుగుదేశంగా భావిస్తున్నంత కాలం ఈ ఇరువురి మ‌ధ్య నెయ్యం గురించి ఇలాంటి ఊహాగానాలు వ‌స్తూనే ఉంటాయి. కాని బీజేపీకి తెలుగుదేశంతో పాటు వైసీపీ కూడా టార్గెట్ అయి, ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంటే ప‌రిస్తితి వేరేగా ఉంటుంది. మ‌రి ఈ విష‌యం తేలేదెప్పుడు? ప‌్ర‌స్తుతం బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల మీద త‌న శ‌క్తియుక్తులు కేంద్రీక‌రించింది. అక్క‌డ స‌రికొత్త రాజ‌కీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. ప‌రిస్థితి అనుకూలించ‌క‌పోతే..అనువు గాని చోట అధికుల‌మ‌న‌రాదు అన్న సామెత‌కు అనుగుణంగా నితీష్ కుమార్‌తో క‌ల‌సి న‌డ‌వ‌డ‌మే..ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిగా అంగీక‌రించ‌డ‌మే. కాదంటే..అంకెల్లో ఆశాజ‌న‌క‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డితే..తానే అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం..ఇదీ బీజేపీ వ్యూహం. ఇందుకు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు బీజేపీ అడుగుల్లో అడుగేస్తూ స‌హ‌క‌రిస్తున్నాడు. ఎన్నిక‌లైపోయి, ఫ‌లితాలొచ్చి, ప్ర‌భుత్వ‌మెవ‌రిదో తేలాక ఏపీలో ప‌రిస్థితి మీద బీజేపీ మ‌రింత శ్ర‌ద్ధ పెడుతుంది. ఎన్డీయే కూట‌మిలోకి వైసీపీని ఆహ్వానించేదీ లేనిదీ తెలిసేది అప్పుడే!

-రాజా రామ్మోహ‌న్ రాయ్