English | Telugu
తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కడుబండి...
Updated : Oct 5, 2019
విజయనగరం జిల్లాలోనే కాదు రాష్ట్రం లోనే టిడిపికి మంచి పట్టున్న నియోజక వర్గం ఎస్ కోట. టిడిపి మొదలు పెట్టిన దెగ్గిర నుండి అడపా దడపా తప్ప ఎప్పుడూ ఆ ప్రాంతంలో టిడిపినే గెలుస్తూ వచ్చింది. రెండు వేల పద్నాలుగులో టిడిపి సీనియర్ నేత కోళ్ల లలితకుమారి ఇక్కడి నుండి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అలాంటి ఎస్ కోట నియోజక వర్గంలో మొదటి నుండి వైసీపీకి పట్టు తక్కువే. గత తొమ్మిదేళ్లుగా ఎస్ కోటలోని వైసీపీ బాధ్యతలు ముగ్గురు నేతలు నిర్వహిస్తున్నారు. వైసిపి సీనియర్ నేతలైన అల్లు జోగినాయుడు, రొంగలి జగన్నాధం, నెక్కల నాయుడుబాబులు ఎస్ కోటలో వైసీపీని ముందుకు నడిపిస్తూ వచ్చారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో వర్గం కావడంతో, టిడిపి నేత కోళ్ల లలిత కుమారి రాజకీయాల ముందు నిలబడలేకపోయారు. దాంతో ఎస్ కోటని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసిపి, పార్టీ పటిష్టత కోసం మరో సీనియర్ నేత ఇందుకూరి రఘురాజుని పార్టీలో చేర్చుకుంది. వారంతా మొన్నటి ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే పక్క నియోజకవర్గానికి చెందిన కడుబండి శ్రీనివాస్ కి ఎస్ కోట టికెట్ దక్కడంతో అక్కడి సీనియర్ నేతలు ఓ సమయంలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. దాంతో రంగంలోకి దిగిన వైసీపీ అధినేత ఎన్నికల సమయంలో అందరూ సమిష్టిగా కృషి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో అందరూ ఒకే మాట పైకి వచ్చి పనిచేయడంతో ఎస్ కోట వైసీపీ వశమైంది.
అదలా ఉంటే ఎన్నికల వరకూ బాగానే ఉన్న నేతలు ఇప్పుడు ఎంఎల్యేని కాదని నియోజకవర్గంలో పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. దాంతో కేడర్ ఎవరి పక్కన ఉండాలో తెలియక అయోమయానికి గురవుతోంది. నియోజక వర్గం లోని నేతలంతా వర్గాలుగా విడిపోవడంతో వైసీపీలో వర్గపోరు పీక్ స్టేజ్ కు చేరింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్, మరో సీనియర్ నేత ఇందుకూరి రఘురాజు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా నియమించిన గ్రామ వార్డు వాలింటర్ల ఎంపిక విషయంలో ఎంఎల్యే కంటే రఘురాజు వర్గానికే అధిక ప్రాధాన్యత దక్కింది. దాంతో ఎమ్మెల్యే కడుబండి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీ వెన్నంటి ఉన్న సీనియర్లకి ఆ ఇద్దరూ అన్యాయం చేస్తున్నారంటూ మరో వర్గం తిరుగుబాటుకై పయనమైయ్యింది. ఒకానొక సమయంలో ఎమ్మెల్యే అనుచరులంతా తమకు అన్యాయం జరుగుతోందని ఆయన ఇంటి ముందునే బైఠాయించి నిరసన తెలిపారు అంటే అక్కడ ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జరుగుతున్న పరిణామాలతో కడుబండి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక నేతలు అధికారులు తనకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నారు. తనకంటే నియోజక వర్గంలోని ఇతర సీనియర్ నేతల మాటలే చెల్లుబాటవుతున్నాయని ఆరోపిస్తున్న ఆయన నియోజక వర్గం పార్టీలో జరుగుతున్న దానిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ ఎమ్మెల్యే పరిస్థితి అలా తయారవడంతో ఆయన అనుచర వర్గం ఏం చేయాలో అర్థం కాక అధికార పక్షంలో ఉన్న ఒక్క పనిచేయించుకోలేక వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.