English | Telugu
సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఇండోనేషియా ప్రభుత్వం!!
Updated : Nov 15, 2019
సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా ప్రభుత్వం. ఇండోనేషియా సముద్ర తీరంలోని మొలక్కాస్ ప్రాంతంలో నవంబర్ 14న అర్థరాత్రి సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.1గా నమోదయిందని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు కూడా జారీచేశారు.
ఇండోనేషియాలో సంభవించిన భూకంప తాకిడి భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవులను కూడా తాకింది. అదే సమయంలో నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అండమాన్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనలకు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ.. ఆస్తి నష్టం కానీ.. జరగలేదని అధికారులు తెలియజేశారు.