English | Telugu

కనకదుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం.. 

విజయవాడ కనకదుర్గమ్మ గుడి నిత్యం వివాదాలలో నలుగుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం అమ్మ వారి వెండి రధం పై ఉన్న మూడు సింహాలు మాయం కావడంతో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా గుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కారులో అక్రమ మద్యం పట్టుబడింది.

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డులో సభ్యురాలుగా జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా అక్రమ మద్యం రవాణా అవుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ చేసి ఉంచిన ఏపీ 16 బీవీ 5577 అనే నెంబర్ గల సుజుకి స్విఫ్ట్ కారులో అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకుని దీని పై దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా బయటపడిన ఈ అక్రమ మద్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి వరలక్ష్మీ భర్త, అలాగే ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పట్టుబడిన మద్యం తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ సుమారుగా రూ. 40 వేలు ఉంటుందని సమాచారం.