English | Telugu
పాక్ యువతి కోసం వెళ్లి పోలీసులకు దొరికిపోయిన హైదరాబాద్ యువకుడు
Updated : Nov 19, 2019
హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాకిస్థాన్ లో అరెస్టయ్యాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన టెకీ దరిలాల్ ను కూడా దేశ భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లుగా పాకిస్థాన్ మీడియా తెలిపింది. పాక్ లోని బహావల్ పూర్ దగ్గర ఖోలిస్తాన్ ఎడారిలో వీరిని సోమవారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరి దగ్గర పాస్ పోర్ట్ లేదని గుర్తించినట్టుగా పాక్ మీడియా పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ కు ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువతిని వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్ వెబ్ సైట్ లలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రవాదానికి కుట్ర పన్నారన్న అభియోగాలు పాకిస్థాన్ మీడియాలో ప్రసారమవుతున్నాయి.
ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు రెండేళ్ల క్రితమే పాక్ భూభాగంలోకి అడుగుపెట్టడాని తెలిపారు. ప్రేమ విఫలమవడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్ అటూ ఇటూ తిరుగుతూ ఎడారి మార్గంలో పాకిస్థాన్ కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతన్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. పాక్ మీడియాలో ప్రసారమవుతున్న ప్రశాంత్ తెలుగు వీడియోలో తన తల్లిదండ్రులకు ఓ సందేశానిచ్చాడు. అయితే ఆ వీడియో రెండేళ్ల కిందటిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అటు శ్రీలంక కస్టమ్స్ అధికారులు ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు. శ్రీలంక అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.