English | Telugu
దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఖమ్మంలోని గొల్లపాడు ఛానల్ సమస్య...
Updated : Oct 5, 2019
ఖమ్మంలో దాదాపు పన్నెండు డివిజన్ లను పట్టి పీడిస్తున్న సమస్య గొల్లపాడు ఛానల్. దశాబ్దాలుగా గొల్లపాడు ఛానల్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో పద్నాలుగు కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దశాబ్దాలు తరబడి ఈ గొల్లపాడు చానల్ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగులుతుంది. తీవ్ర దుర్గంధం గొల్లపాడు ఛానల్ లో పేరుకు పోయిన చెత్త, వ్యర్థాల వల్ల వెలువడుతుంది. పది డివిజన్ ల పరిధిలో ఈ గొల్లపాడు చానల్ పధ్నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ గొల్లపాడు చానల్ ద్వారా పది డివిజన్ లలోని ప్రజలు అల్లాడిపోతున్నారు.
దీంట్లో వ్యర్ధాలు పేరుకుపోవడం, మురుగు నీరు పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. నిరంతరం తీవ్ర దుర్గంధం వెలువడుతున్న కలుషిత జలాల మధ్యనే ప్రజలు నివసించాల్సిన పరిస్థితి ఖమ్మం నగరంలోని పది డివిజన్ లలో ఉంది. సీజనల్ వ్యాధులతో అనేక రకాలుగా ఈ గొల్లపాడు ఛానల్ ద్వారా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక పక్క తీవ్రమైన దుర్గంధం, దుర్వాసన మరో పక్క విష జంతువులు, దోమలతో సహవాసం చేయాల్సిన దుస్థితి గొల్లపాడు చానల్ పక్క నివాసముండేవారికి ఉంది. చిన్న చిన్న కాలువలైతే మేమే శుభ్రం చేసుకునే వాళ్ళమని, అది చాలా పెద్దది కావడం వల్ల వీలు కావట్లేదని, తమ దగ్గరకొచ్చి ఓట్లు ఎలా అయితే వేయించుకుంటున్నారో అలానే ఆ ఛానల్ ను శుభ్రం చేయించమని ప్రభుత్వాన్ని ఆ ప్రాంత ప్రజలు కోరారు.