English | Telugu
విజయవాడలో ఫ్లెక్సీల కలకలం.. అధికార పార్టీ నేతల బహిరంగ బెదిరింపులు!!
Updated : Sep 25, 2020
వైసీపీ టియుసి నాయకుడు మాడు శివరామ కృష్ణ పేరిట పెట్టిన ఈ ఫ్లెక్సీల్లో ఉన్న మాటలు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు? మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకోం అని ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారా?. ఎవరిని బెదిరించటానికి ఇంత బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టారు? అనే చర్చ మొదలైంది. రాజ్యాంగ వ్యవస్థలు అని చెప్పి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు ప్రశ్నించటానికి అనే ధోరణి ఎంతవరకు కరెక్ట్?. ప్రతిపక్ష పార్టీని అయితే డైరెక్ట్ గా విరుచుకుపడే వారని, ఇది కేంద్రాన్ని కానీ, కోర్టులను కానీ ఉద్దేశించి రాసినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా రాజ్యసభలో కోర్టులను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ ఆ వివాదాస్పద ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కూడా ఉంది. ఇక ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు, మంత్రి కొడాలి నాని వంటి వారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనికితోడు న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ఈ వరుస పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో జగన్ కి క్లాస్ పీకారని వార్తలొచ్చాయి. మరోవైపు, అవినీతి ఆరోపణల కేసులో జగన్ మరోసారి జైలుకి వెళ్లే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో "మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకోం" అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపుతోంది. మరి ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను వైసీపీ అధిష్టానం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఖండిస్తారా? లేక ఆ ఫ్లెక్సీల వెనుక మేమున్నాం అన్న పరోక్ష సంకేతాలు ఇస్తారా చూడాలి. ఏదిఏమైనా ఇలా బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులకు దిగడం మంచి పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.