English | Telugu
భారత అమ్ములపొదిలోకి మరో ఆయుధం... ఐఏఎఫ్ చేతికి తొలి రాఫెల్...
Updated : Oct 9, 2019
భారత అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన రాఫెల్ వార్ ఫైటర్... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందింది. అత్యంత శుభప్రదమైన విజయదశమి రోజు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాన్ని... కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారికంగా అందుకున్నారు. ఈ సందర్భంగా రాఫెల్ కు ఆయుధపూజ నిర్వహించి... టైర్ల కింద నిమ్మకాయలు ఉంచారు. అలాగే, రాఫెల్ పై ఓంకారం రాశారు, కొబ్బరికాయను ఉంచి పూలు వేశారు. అయితే, దసరా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవం కలిసి వచ్చిన రోజున తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని రాజ్ నాథ్ అందుకోవడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజ్ నాథ్ ఫ్రాన్స్ పర్యటనలో ఉండగా, తొలి రాఫెల్ విమానాన్ని భారత్ కు అందజేసింది. ఈ కార్యక్రమం ఫ్రాన్స్ మేరినాక్ లోని డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ప్రాంగణంలో జరిగింది. ఇక, తొలి రాఫెల్ ను భారత్ కు అందజేసిన కార్యక్రమంలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి, ఇరు దేశాల ప్రభుత్వ ప్రతినిథులు, డసాల్ట్ ఏవియేషన్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో సమావేశమైన రాజ్ నాథ్... ఇరుదేశాల రక్షణ ఒప్పందాలపై చర్చించారు.
రాఫెల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని రాజ్ నాథ్ అన్నారు. అలాగే, అనుకున్న గడువులోపు రాఫెల్ యుద్ధ విమానాలు డెలివరీ జరుగుతుండటంతో సంతోషం వ్యక్తంచేశారు. మిగతా రాఫెల్ జెట్స్ కూడా సకాలంలో అందజేయాలని ఫ్రాన్స్ ను కోరారు. రాఫెల్ అంటే సుడిగాలి అన్న రాజ్ నాథ్.... ఆ పేరుకు తగ్గట్టుగా రాణిస్తుందని అన్నారు.