English | Telugu

రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం.. ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్ 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్ర‌సంగాలు, వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూ ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన కార‌ణంగా నిషేదం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హింసను ప్రేరేపించేలా వ్యాఖ్య‌లు చేస్తున్న కార‌ణంగా ఆయ‌న ఫేస్‌బుక్ అకౌంట్‌ ని తొలిగిస్తున్నామంటూ ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు.

ఫేస్‌బుక్ నిషేదంపై స్పందించిన రాజాసింగ్.. త‌న‌కు అఫీషియ‌ల్‌ గా ఫేస్‌బుక్ అకౌంట్ లేద‌ని, త‌న పేరుతో ఉన్న న‌కిలీ అకౌంట్ల‌కు తాను బాధ్యుడిని కానంటూ వివర‌ణ ఇచ్చారు. ఫేస్ బుక్ లో తన పేరు మీద ప్రస్తుతమున్నపేజీలు నా అధికారిక పేజీలు కాదు.. వాటిని తొలగించినందుకు ఫేస్‌బుక్‌ కి ధన్యవాదాలు అన్నారు. అయితే, ఆయా పేజీలలో చేసిన పోస్టులతో తాను ఏకీభవిస్తానన్నారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ 2018 లో హ్యాక్ అయ్యిందని.. ఆ తర్వాత దాన్ని వాడేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయితే, తాను సొంతంగా వాడేందుకు ప్రస్తుతం ఒక ఫేస్‌బుక్‌ పేజీ కావాలి.. దాన్ని ఫేస్‌బుక్‌ విధానాలను ఉల్లంఘించకుండా ఉపయోగిస్తాను. దీనికి సంబంధించి సదరు సంస్థకు విన్నవించుకుంటానంటూ రాజాసింగ్ పేర్కొన్నారు.

కాగా, భారత్‌ లో అధికారబీజేపీ నేతలు ఫేస్‌బుక్‌ లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఫేస్‌బుక్‌ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని..‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ఇటీవల కథనం ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా.. ఫేస్‌బుక్‌ సంస్థకి లేఖలు కూడా రాసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజాసింగ్‌పై నిషేధం విధించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.