English | Telugu

నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ విచారణ...

ఈఎస్ఐ స్కామ్ విషయంపై రోజు రోజుకు చర్చలు కొనసాగుతున్నాయి.నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోరింది. మరోవైపు బెయిల్ ను మంజూరు చేయాలని నిందితుల సైతం పిటిషన్ వేశారు. రెండు పిటిషన్ ల పై ఏసీబీ కోర్టు విచారించనుంది.

అదే విధంగా ఈ కేసులో మరికొంతమందిని కూడా అధికారులు విచారించనున్నట్లు తెలుస్తున్నది. స్కామ్ లో తీగ లాగితే డొంక కదులుతున్నట్లు డైరక్టర్ దేవికారాణి అరెస్ట్ చేసి స్కామ్ వెనుక ఉన్న పాత్రథారులు ఒక్కరు ఒక్కరుగా తెరమీదకు వస్తున్నారు. ఈఎస్ఐ విభాగం లోని సిబ్బందితో అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై భారీగా దోచుకుంటున్నట్లు ఏసీబీ నిర్థారించింది. గడచిన నాలుగేళ్లలో ఏడాదికి రూ.రెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున వెయ్యి కోట్ల రూపాయల మెడిసిన్ కొనుగోలు చేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై డిస్పెన్సరీల వివరాలు సేకరించిన అధికారులు కుంభకోణం పాత్రధారులను శరవేగంగా గుర్తిస్తోంది. విచారణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో అథికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడికి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న ఉద్యోగి నాగరాజు ఇంట్లో నలభై ఆరు కోట్ల విలువైన నకిలీ ఇండెట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురు ఈఎస్ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు.

ఇప్పటికే దేవికారాణి తోపాటు ఏడుగురిని అరెస్ట్ చేసిన అధికారులు మరో రెండ్రోజుల్లో స్కామ్ కు సంబంధం ఉన్న మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కుంభకోణంలో డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ తరవాత శివనాగరాజునే కీలక నిందితుడిగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ కు మధ్యవర్తిగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను శివనాగరాజు స్వీకరించినట్లు తెలుస్తోంది. అతన్ని విచారిస్తే ఇండెంట్లు పర్చేజ్ ఆర్డర్ల సమాధానం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ ఏమవుతుందో చూడాలి ఎందుకంటే ఇటు నిందితులు కూడా బెయిల్ కోసం పిటిషన్ లు వేస్తున్నారు. అటు ఏసీబీ కూడా రిమాండ్ కస్టడీ కోసం తమ వాదనలు వినిపించనుంది. కోర్ట్ ఏం నిర్ణయిస్తుందని ఏసీబీ కోర్టులో మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కన్పిస్తోంది. ఎనిమిది మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు. మరికొంతమందిని ఇవాళ ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరున్నారనే విషయాల మీద ప్రస్తుతం అధికారులు కూపీలాగుతున్నట్లుగా సమాచారం.