English | Telugu
దేవరగట్టులో కర్రల యుద్ధం... 70మందికి పగిలిన తలలు... ఏడుగురికి సీరియస్
Updated : Oct 9, 2019
తలలు పగిలాయి... రక్తం చిందింది... ఎంతమంది పోలీసులను మోహరించినా... ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా... కర్నూలు జిల్లా దేవరగట్టు బన్సీ ఉత్సవాల కర్రల సమరంలో రక్తపాతాన్ని నివారించలేకపోయారు. దేవరగట్టు కర్రల యుద్ధంలో ఎప్పటిలాగే రక్తం చిందింది. మాలమల్లేశ్వరస్వామి కోసం భీకర పోరు జరిగింది. వేలాది మంది భక్తులు.... చిమ్మ చీకటిలో... దివిటీల వెలుగులో... కర్రలతో హోరాహోరీగా తలపడ్డారు. తలలు బద్దలు కొట్టుకుంటూ మాలమల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈ పోరాటంలో 70మంది తలలు పగిలాయి. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఇక, గాయపడ్డవారిలో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దేవరగట్టు కర్రల సమరంలో ఈసారి ఎలాగైనా రక్తపాతాన్ని ఆపాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అందుకోసం ముందుగానే 10 గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బన్నీ ఉత్సవాల్లో ఇనుప చువ్వలు, రింగ్‌లు వినియోగించకుండా నిషేధం విధించారు. ఎవరైనా హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అయినా ఎప్పటిలాగానే కర్రల సమరంలో రక్తం చిందింది. పలువురి తలలు పగిలాయి.
కర్రకు ఇనుప రింగులు తొడిగి, కాగడాల వెలుగులో మాలమల్లేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొస్తారు. అయితే ఇలా కర్రలతో కొట్టుకోవడం హింస కాదని... ఇది అనాదిగా వస్తున్న తమ ఆచారమంటున్నారు భక్తులు. 11వ శతాబ్దం నుంచి ఈ బన్నీ ఉత్సవం జరుగుతోందని చెబుతున్నారు. అయితే బన్నీ ఉత్సవంలో ఎలాంటి రక్తపాతం జరగకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కొన్నేళ్లుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజం ఉండట్లేదు. ప్రతి ఏటా రక్తపాతం జరుగుతూనే ఉంది... తలలు పగులుతూనే ఉన్నాయి.
మరోవైపు, ఈ బన్నీ ఉత్సవాన్ని, కర్రల సమరాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో దేవరగట్టు జనసంద్రంగా మారింది. అయితే, కర్రల సమరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1200మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ఎవరికైనా గాయాలైతే అత్యవసర చికిత్స అందించడానికి సుమారు వంద మంది మెడికల్ సిబ్బందిని వినియోగించారు.