English | Telugu
జామియా చుట్టూ తిరుగుతున్న హస్తిన రాజకీయం!
Updated : Jan 31, 2020
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జామియా వర్సిటీ ప్రాంగణంలో గత నెలలో జరిగిన హింసాత్మక ఘటనలు మరువక ముందే మరో ఘటన జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేసిన జామియా వర్సిటీ విద్యార్థుల పై ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడిలో ఓ వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపు లోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన పై రాజకీయ దుమారం రేగుతోంది. జామియా వర్సిటీ దగ్గర జరిగిన కాల్పుల ఘటన పై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నేరస్తులు ఎక్కడికీ తప్పించుకోలేరన్నారు. పౌరసత్వ
సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదే కోరుకుంటున్నారా అంటూ ప్రశంసించింది. జామియా కాల్పుల ఘటన పై ప్రియాంక గాంధీ కూడా ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనకు బీజేపీయే కారణమంటూ ఆమాద్మీ పార్టీ ఆరోపించింది. రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీ చర్యల వల్లే పోలీసులు మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్షాల పై బిజెపి ఎదురు దాడికి దిగింది. సీఏఏ కు వ్యతిరేక నిరసనని ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రోత్సహిస్తోందని పలువురు బిజెపి నాయకులు ఆరోపించారు. షహీన్ బాగ్ లో జరిగిన నిరసనలకు కూడా ఆ పార్టీయే కారణమని.. ఆ ఆందోళనలకు సంబంధించిన ఖర్చులను కూడా ఆప్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుగానే పరిగణించాలని ఈసీని కోరారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను రికార్డులను ఈసీకి సమర్పించింది. మొత్తానికి మరోసారి జామియా వర్సిటీలో సీఐఏ మంటలు చెలరేగాయి. తమకు రక్షణ కల్పించాలంటూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కాస్తా రాజకీయ రంగు పులుముకుని పార్టీల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది.