English | Telugu

దానం నాగేందర్ రాజీనామాకు రెడీ అయిపోయారా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనపై అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.

ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం. అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.