English | Telugu
హాజీపూర్ వరుస హత్యల కేసులో ఈరోజే తుది తీర్పు
Updated : Feb 6, 2020
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇవాళ ఏం తీర్పు వెల్లడించబోతుందోనని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతేడాది వెలుగులోకొచ్చిన హాజీపూర్ సీరియల్ హత్యల కేసులో నల్గొండ పోక్సో కోర్టు తీర్పు చెప్పనుంది. ముగ్గురు మైనర్ బాలికలకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు విచారణను చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు తొంభై రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. జూలై ముప్పై ఒకటిన నల్గొండ లోని ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా చార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబరు పద్నాలుగు నుంచి న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.
ముగ్గురూ మైనర్ బాలికలే కావడంతో నల్గొండ లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగింది. సుమారు రెండున్నర నెలల పాటు మూడు కేసుల్లో ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించింది. మూడు కేసుల్లో మొత్తం నూట ఒక్క మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించడంతో పోక్సో కోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నిర్భయ కేసులో ఉరిశిక్ష వేయడం, దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం, సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయడం హాజీపూర్ నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిందితుడికి ఉరిశిక్ష విధించినట్లయితే నల్గొండ జిల్లా కోర్టులో ఉరిశిక్ష విధించబడిన తొలి కేసుగా రికార్డుల్లోకి ఎక్కుతుంది.