English | Telugu

తెలంగాణలో కరోనా కేసులు లక్షకు చేరువలో

తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వైరస్ విజృంభణ నానాటికీ పెరుగుతుంది. ప్రతిరోజూ వందలాది కేసులు కొత్తగా నమోదు అవుతూ లక్ష మార్క్ కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకోనుంది. కోలుకుంటున్న వారి శాతం 77.43శాతంగా ఉంది. అయితే ఇప్పటికే ఆరున్నర లక్షల మందికి పైగా కరోనా వచ్చి పోయిందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వచ్చిందన్న విషయం కూడా వారికి తెలియకుండానే నయం అయ్యిందని సరైన పద్దతిలో టేస్టింగ్, ట్రేసింగ్, ట్రిట్ మెంట్ జరగడం లేదని మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సెప్టెంబర్ నెలలో మొదటి రెండు వారాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక స్పష్టం చేస్తుంది. వైరస్ ను ఎదుర్కునే శక్తి ప్రజల్లో పెరుగుతోందని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వాలు పట్టణాలు, గ్రామాలకు వైద్యసేవలు విస్తరించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ నెల చివరి వారం నుంచి చెన్నైలో, నవంబర్ చివరినాటికి ముంబయి నగరం లోనూ చాలావరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఈ తాజా నివేదిక చెబుతోంది. వ్యాక్సిన్ కూడా త్వరగా అందుబాటులోకి వస్తే 2020 చివరకి నాటికి పూర్తిగా కరోనా రహితంగా మారే ఆశలు కనిపిస్తున్నాయి.