English | Telugu

తెలంగాణాలో 471కి పెరిగిన పాజిటివ్ కేసులు!

ఈ రోజు కొత్త‌గా మ‌రో 18 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇందులో మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారు 388 మంది వున్నారు. క‌రోనా బారిన ప‌డి ఇప్ప‌ట్టి వ‌ర‌కు 12 మంది మృతి చెందారు. తెలంగాణాలో క‌రోనా క‌ట్ట‌డికీ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి ఈటెల తెలిపారు.

ఏప్రిల్ 24 క‌ల్లా క‌రోనా బాధితులంతా కోలుకుంటార‌ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం అవ్వాల‌ని మంత్రి మ‌రోసారి పిలుపునిచ్చారు.

ఇప్ప‌ట్టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో 175 పాజిటివ్‌ కేసులు న‌మోదైయ్యాయి. అందుకే హైద‌రాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో వైరస్ వేగంగా ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. హాట్ స్పాట్స్ ప్రాంతాలను పూర్తిగా జీహెచ్ఎంసీ ఆధీనంలోకి తీసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ సర్కిళ్ళ వారీగా అధికారులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను ఇష్యూ చేశారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించిన 15 ప్రాంతాలపై ఉత్తర్వులు జారీచేశారు జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు.

రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ వంటి ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తలపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 89 మంది కంటైన్‌మెంట్ క్లస్టర్లు ప్రాంతాలలోనే నమోదవడంతో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.