English | Telugu

సీఎం జగన్ ని కలిసింది నకిలీ రైతులా.. పెయిడ్ ఆర్టిస్టుల గుట్టు రట్టు!!

జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా... అమరావతి ప్రాంత రైతులు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే రాజధాని కోసం ఆందోళన చేస్తున్న వాళ్ళు రైతులు కాదు.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ.. అధికార పార్టీ వైసీపీ నేతలు పలువురు ఆరోపించారు. దీంతో అధికార పార్టీ నేతలపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ వంటి వారు దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన రైతుల్ని, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించడం సరికాదంటూ ఆ వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీనే.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు మొదలుపెట్టిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజధాని రైతులు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నానిలతో కలిసి వెళ్లి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై మంది రైతులు జగన్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారని, జగన్ వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వార్తలొచ్చాయి. అయితే దీనిలో ఓ ట్విస్ట్ ఉందట. సీఎం జగన్ తో భేటీ అయిన వారు అసలు రైతులే కాదట, వారిలో కొందరు ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువులు, సన్నిహితులు కాగా, మరికొందరు వైసీపీ కార్యకర్తలట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వారి పేర్లు, ఫోటోలు, వారికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉన్న బంధుత్వంతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లిన వారిలో.. చోడిశెట్టి నిర్మలత అనే మహిళ ఉంది. ఆమె ఆర్కే లాయర్‌ అని తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డి, బోనురెడ్డి, సాంబిరెడ్డి, నాగిరెడ్డిలు.. ఆర్కే బంధువులు మాత్రమే కాదు.. వైసీపీ స్థానిక నేతలని కూడా తెలుస్తోంది. ఇలా పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... అసలైన పెయిడ్ ఆర్టిస్టుల డ్రామా వైసీపీదేనంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.