English | Telugu

మొత్తం మార్చేద్దాం... ఏం చేయాలో చెప్పండి... 

అక్టోబర్ చివరి నాటికి మార్కెట్ కమిటీలను నియమించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. క్యాంప్ ఆఫీస్‌‌లో మార్కెటింగ్ అండ్ సహకారశాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్.... అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మార్కెట్‌ ఛైర్మన్ పదవుల్లో, కమిటీల్లో... సగం మహిళలకే ఇవ్వాలని సూచించారు. అలాగే, ఎస్సీ-ఎస్టీ-బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.

ఇక, సహకార రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలన్న జగన్మోహన్ రెడ్డి.... దళారి వ్యవస్థను ఆరు నెలల్లో రూపు మాపాలని ఆదేశించారు. సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ వేయాలని, అలాగే వాటిని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధంచేయాలని జగన్ ఆదేశించారు. సహకార రంగాన్ని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలన్న జగన్మోహన్ రెడ్డి.... అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇవన్నీ ఆరు నెలల కాలంలోనే అధ్యయనం పూర్తిచేసి సిఫార్సులు అమలు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధంచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇక, పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని అధికారులకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. ధరల స్థిరీకరణ, కనీస మద్దతు ధర, మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకున్నాక పరిస్థితి కచ్చితంగా మారాలని, సర్కారు భరోసా ఇచ్చిందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్నారు. మొత్తం వ్యవస్థను ప్రక్షాళనచేసి బాగు చేద్దామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అందుకోసం ఏంచేయాలో సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులను కోరారు.