English | Telugu
పౌరసత్వ బిల్లు.. మైనారిటీలకు భారత్ లోనే రక్షణ ఉందంటున్న అమిత్ షా
Updated : Dec 11, 2019
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందింది కనుక రాజ్యసభలో కూడా తప్పకుండా బిల్లుకు ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు అమిత్ షా. పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రక బిల్లు అని దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. పొరుగు దేశాల్లో మైనార్టీలకు రక్షణ లేదన్నారు. భారత్ లో మాత్రం మైనారిటీలకు పూర్తి రక్షణ ఉందన్నారు.
తృణమూల్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నాజీల నుంచి ప్రేరణ పొందిన అమిత్ షా ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్. ఈ బిల్లు బెంగాలీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారని ఆరోపించారు. క్యాబ్ బిల్ తప్పుల తడక అని విమర్శించారు. దేశ భక్తి గురించి తమకు అమిత్ షా పాఠాలు అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లును బెంగాల్ లోనే కాదు దేశ వ్యాప్తంగా తృణమూల్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు డెరిక్ ఒబ్రెయిన్.
ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చినట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు అమిత్ షా. పౌరసత్వ సవరణ బిల్లు మానిఫెస్టోలో ఉందని స్పష్టం చేశారు. భారత్ లో ముస్లింలకు పూర్తి రక్షణ ఉందన్నారు. పొరుగు దేశాల్లో వివక్ష కారణంగా భారత్ కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆనంద్ శర్మ. మతం ప్రాతిపదికన గత 70 ఏళ్ళలో ఎప్పుడూ భారత పౌరసత్వం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. ఎప్పట్నుంచో శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇస్తోందని స్పష్టం చేశారు ఆనంద్ శర్మ.