English | Telugu

దుబ్బాకలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా చెరుకు శ్రీ‌నివాస్ రెడ్డి..!

దుబ్బాక ఉపఎన్నికలకు సిద్దమవుతున్న టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌లింది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ త‌రుపున శ్రీ‌నివాస్ రెడ్డి పోటీ చేయ‌టం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి ముత్యంరెడ్డితో పాటు శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే నియోజకవర్గంలో త‌న తండ్రి చేసిన మంచి ప‌నుల గురించి గుర్తు చేస్తూ.. నిత్యం కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న త‌న‌కు టికెట్ కేటాయిస్తే గెలిచి వ‌స్తాన‌ని టీఆర్ఎస్ అధిష్టానాన్ని శ్రీ‌నివాస్ రెడ్డి కోరగా.. టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించినట్లు తెలుస్తోంది.

దీంతో శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరిపినట్లుగా సమాచారం. దుబ్బాక అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దామోదరతో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి కాంగ్రెస్ తరుఫున దుబ్బాక నుండి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, స్థానికేత‌రుడు అయినందున ఆయ‌నపై కాంగ్రెస్ పునరాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ‌నివాస్ రెడ్డి చేరిక‌, టికెట్ పై ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా కాంగ్రెస్ నేత‌ల‌తో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ విషయం పై త్వరలోనే కాంగ్రెస్ పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.