English | Telugu
బాబు నిర్లక్ష్యంతో.. కంచుకోటలాంటి ఆ నియోజకవర్గంలో మూడో స్థానానికి టీడీపీ..
Updated : Aug 25, 2020
వాస్తవానికి టిడిపి నుంచి వైసిపి లోకి వెళ్లిన వంశీ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇప్పటికే వైసిపి లో ఉన్న గ్రూపు తగాదాలతో ఆయనకు కూడా చుక్కలు కనపడుతున్నాయంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎప్పటి నుండో పాతుకుపోయిన దుట్టా రామచంద్రరావు వర్గీయులు ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరో పక్క గత ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎమ్మెల్యే వంశీ కి చిక్కులు సృష్టిస్తున్నారు. దీనికి తోడు దుట్టా అల్లుడు నియోజకవర్గ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. అయితే దుట్టా, యార్లగడ్డ వర్గాలను కలుపుకుని వెళ్లాలని వంశీ ఎంత ప్రయత్నిస్తున్నా వారు ఆయనకు సహకరించడం లేదు. ఒకవేళ వారిద్దరూ సహకరిస్తే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళతానని వైసిపి తరుపున గెలిచి రాజధాని ప్రాంతంలో రికార్డు సృష్టించాలని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అది సాధ్యం కాకపోవడంతో తనతో పాటు నిన్నటి వరకు టిడిపిలో పనిచేసి తన వెంట రాని నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు.
కొన్ని గ్రామాల్లో ఉన్న టిడిపి నాయకులు వంశీ వెంట వెళుతున్నా వారిని ఆపేవారు కానీ, వారికి సర్దిచెప్పి పార్టీలో ఉండేలా చేయగలిగిన నాయకులు కానీ ప్రస్తుతం టిడిపిలో కనిపించడం లేదు. రోజు రోజుకు నియోజకవర్గంలో టిడిపి బలహీనం అవుతున్నా బాబు గారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. ఒకవేళ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగి వంశీ కి వైసిపి టికెట్ వస్తే ఆయనను వ్యతిరేకించే వైసిపి నాయకులు ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉపఎన్నికల్లో పోటీ వంశీకి ఇండిపెండెంట్ అభ్యర్ధికి మధ్యే జరిగే పరిస్థితి. దీంతో టిడిపి మూడవ స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఎవరో ఒకరికి ఇన్‌ఛార్జి పదవిని అప్పగించకపోతే అయన కలలుగన్న రాజధాని ప్రాంతంలో, టీడీపీ కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో టీడీపీ మూడోస్థానానికి పడిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.