English | Telugu

అర్ధరాత్రి నోటీసులు, అరెస్టులు, కూల్చివేతలు! వేధింపులే లక్ష్యమన్న చంద్రబాబు 

అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి జీవీఎంసీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. కక్ష పూరిత చర్యల్లో భాగంగానే అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు అంటిస్తున్నారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగాన్ని, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు చంద్రబాబు.

అధికారంలో ఉన్నవాళ్లు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలు ఆలోచిస్తారు, ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని కూడా ఉత్తేజపరుస్తారు... కానీ వైసీపీ పాలకుల తీరు వేరని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనతో వైసీపీ రాత్రుళ్ళు నిద్రకూడా పోతున్నట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు. సబ్బం హరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించిందని, కానీ అంతలోనే భవనాలు తొలగించాలంటూ ప్రభుత్వం మరో నోటీసును పంపించిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆ నోటీసును కూడా రాత్రివేళ ఇంటికి అంటించిపోయారని ఆరోపించారు.

సబ్బం హరికి జీవీఎంసీ అధికారులు గురువారం రాత్రి నోటీసులు జారీచేశారు. రిజర్వు ఓపెన్‌ స్పేస్‌లో భవనాలను నిర్మించారని, 3 రోజుల్లో వాటిని తొలగించాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది హరి ఇంటికి వెళ్లగా ఆయన లేరు. ఆ నోటీసును తీసుకునేందుకు వాచ్‌మన్‌ నిరాకరించడంతో గోడకు అతికించి వెళ్లిపోయారు. జీవీఎంసీకి అందించిన స్కీమ్‌ ప్లాన్‌ ప్రకారం సుమారు 2,200 గజాల స్థలాన్ని రిజర్వు ఓపెన్‌ స్పేస్‌గా మార్క్‌ చేశారు. ప్రస్తుతం అందులో కొంతభాగంలో సబ్బం హరికి చెందిన రెండు భవనాలు, గురవారెడ్డి, చిరంజీవిరెడ్డి, రాధాకృష్ణ అనే వ్యక్తులకు చెందిన భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పార్కు స్థలంలో సుమారు వంద గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ జీవీఎంసీ సిబ్బంది నెల రోజుల కిందట తెల్లవారుజామున వాచ్‌మన్‌ గది బాత్‌రూమ్‌ను కూలగొట్టారు.

మరోవైపు విశాఖలో ఉన్న తన స్థలంలోని నిర్మాణాల తదుపరి కూల్చివేతలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ సబ్బం హరి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆయన దాఖలు చేసుకున్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై సోమవారం వరకు స్టేట్‌సకో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు.