English | Telugu

కుటుంబ నియంత్రణపై బలవంతం చేయలేం.. అది దంపతుల ఇష్టం

కుటుంబ నియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై కేంద్రం తాజాగా న్యాయస్థానానికి తమ అఫిడవిట్‌ సమర్పించింది. ఈ అఫిడ‌విట్‌ లో.. తమకు ఎంతమంది పిల్లలు కావాలో అది పూర్తిగా దంపతుల ఇష్టమేనని, కుటుంబ నియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. కుటుంబ నియంత్రణపై బలవంతపు చర్యలను భారత్‌ నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని, ఒకవేళ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని ప్రజలను బలవంతపెడితే అది ప్రజల నుంచి నిరసనలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే భారత్‌ లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని.. 2000 సంవత్సరంలో సంతానోత్పత్తి రేటు 3.2శాతంగా ఉండగా.. 2018 నాటికి అది 2.2 శాతానికి తగ్గిందని పేర్కొంది. 2025 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1 శాతంగా ఉండేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపింది.

కాగా, జ‌నాభా నియంత్ర‌ణకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాల‌ని బీజేపీ నేత, న్యాయ‌వాది అశ్వినీకుమార్ ఢిల్లీ హైకోర్టులో మొద‌ట పిటిష‌న్ వేశారు. జ‌నాభా నియంత్ర‌ణ పెరుగుద‌ల‌తో కాలుష్యం, నిరుద్యోగం పెర‌గ‌డంతో పాటు క‌నీస అవ‌స‌రాలు ప్ర‌తి ఒక్క‌రికీ అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. అంతేగాక, జ‌నాభా పెరుగుద‌ల అవినీతికి కార‌ణ‌మ‌వు తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే జ‌నాభా నియంత్ర‌ణపై చ‌ట్టాలు చేసేది చ‌ట్ట‌స‌భ‌లు మాత్ర‌మేన‌ని, కోర్టులు కాద‌ని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది. దీంతో, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అశ్వినీకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌పై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.