English | Telugu
దుబ్బాకలో కారు బోల్తా! ఉత్కంఠ పోరులో రఘునందన్ విజయం
Updated : Nov 10, 2020
20-20 మ్యాచ్ ను తలపిస్తూ సాగింది దుబ్బాక కౌంటింగ్. రౌండ్ రౌండ్ కు ట్రెండ్స్ మారిపోయాయి. చివరి రౌండ్ వరకు ఎవరూ గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ లీడ్ సాధించగా.. 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చింది. మళ్లీ 8. 9 రౌండ్లలో కమలం పార్టీకి లీడ్ వచ్చింది. 10వ రౌండ్ లో కారుకు ఎక్కవ ఓట్లు రాగా.. 12వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి వందల ఓట్ల లీడ్ వచ్చింది. అయితే కొన్ని రౌండ్లలో కారుకు లీడ్ వచ్చినా ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీనే లీడ్ కొనసాగిస్తూ వచ్చింది.
అయితే 13వ రౌండ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 13 నుంచి 19వ రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ వరుసగా లీడ్ సాధించింది. దీంతో 18వ రౌండ్ తర్వాత తొలిసారి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును క్రాస్ చేసి లీడింగ్ లోకి వచ్చారు సోలిపేట సుజాత. అయితే 20,21, 22 రౌండ్లలో మళ్లీ బీజేపీ పుంజుకుని మంచి లీడ్ సాధించింది. చివరి 23 రౌండ్ లోనూ రఘునందన్ రావుకు మంచి లీడ్ రావడంతో సోలిపేట సుజాతపై ఆయన గెలుపొందారు.
మొదట కౌంటింగ్ జరిగిన దుబ్బాక మండలంలో బీజేపీ పూ్ర్తి అధిక్యం సాధించింది. మొదటి రౌండు నుంచి అయిదు రౌండ్ వరకూ బీజేపీ ఆధిక్యంలోనే దూసుకెళ్లింది. మొత్తంగా దుబ్బాక మండలంలో బీజేపీ 3020 ఓట్ల మెజారీటీ సొంతం చేసుకుంది. అయితే మిరుదొడ్డి మండలానికి వచ్చేసరికి కారుకు లీడ్ దక్కింది. 6,7 వ రౌండ్లలో మాత్రం సోలిపేట సుజాతకు ఆధిక్యం వచ్చింది. తొగుంట మండలం ఓట్ల లెక్కింపులో 8.9 రౌండ్లలో మళ్లీ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 10 వ రౌండ్ లో సుజాతకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 11 రౌండ్లుగా వెనుకబడిపోయిన కాంగ్రెస్ పార్టీ 12వ రౌండులో ఎట్టకేలకు ఆధిక్యతను సాధించింది. ఈ రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి 83 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో టీఆర్ఎస్ ఈ రౌండులో మూడో స్థానానికి పరిమితమైంది.
13వ రౌండ్ నుంచి దౌల్తాబాద్ మండల ఓట్లు లెక్కించడంతో కారు పార్టీ భారీగా పుంజుకుంది. రాయపోల్ మండలంలోనూ టీఆర్ఎస్ హవా చూపించింది. వరుస ఆరు రౌండ్లలో కారుకు లీడ్ రావడంతో ఓవరాల్ గాను రఘునందన్ రావును క్రాస్ చేశారు సుజాత. అయితే నార్సింగ్. చేగుంట మండలాలకు సంబంధించి జరిగిన చివరి రౌండ్ల లెక్కింపులో మళ్లీ కమలం పుంజుకోవడంతో రఘునందన్ రావు విజయం సాధించారు.
దుబ్బాకలో విజయం సాధించడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దుబ్బాకతో పాటు సిరిసిల్ల, హైదరాబాద్ లో భారీగా క్రాకర్స్ కాల్చి తీన్మార్ స్టెప్పులు వేశారు కమలం నేతలు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.ఇక ఓటమితో టీఆర్ఎస్ నేతలు ఢీలా పడ్డారు. అధికార పార్టీగా ఉండి, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ఉన్నా గెలవకపోవడంతో గులాబీ నేతలంతా తీవ్ర విచారంలో మునిగిపోయారు. మూడో స్థానానికి పడిపోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.