English | Telugu

ప్రధానితో భేటీ... కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

ప్రధానమంత్రి మోదీతో కేసీఆర్ సమావేశం దాదాపు యాభై నిమిషాల పాటు సాగింది. ఇరవై మూడు అంశాలకు సంబంధించిన లెక్కల్ని ప్రధానికి ఆయన అందించారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఐఐటిలు, ఐఐఎంలు ఏర్పాటు చేయటం, రోడ్ల నిర్మాణం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయటంతో పాటు నీతి అయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి అయిదు వేల కోట్ల రూపాయలు, మిషన్ భగీరథకు పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చెయ్యాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా రిజర్వేషన్ ల అంశాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ముస్లింలలోని వెనుక బడిన కులాలకు పన్నెండు శాతం రిజర్వేషన్ లతో కలిపి మొత్తం బీసీలకు ముప్పై ఏడు శాతం, ఎస్సీలకు పదిహేను శాతం, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ లు కల్పించాలని పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లు కల్పించాలని కోరారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి జాబితా ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులకు ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. కేంద్రం ఆలోచన ఎలా ఉన్నా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు అధికార పార్టీల మీద ఆగ్రహంతో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ఏపీలోని బిజెపి నేతలు వైసిపి ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు. అంతేకాదు ఏపీలో బీజేపీని బలోపేతం చేయటంకి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన నేతలను స్వాగతిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడు ఒక ఊపులో ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తోంది. రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన నాటి నుంచి అటు నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ పరిణితి చెందిన రాజకీయాలను ప్రదర్శించారు. పరస్పరం సహకరించుకునే ధోరణి తోనే అయిదేళ్లు గడిపారు. అయితే రెండు వేల పధ్ధెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్, బీజేపీ పైనా ఘాటైన విమర్శలకు దిగారు. కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కుండ బద్ధలు కొట్టారు. దాంతో బిజెపి నేతలు భగ్గుమన్నారు. అప్పట్నించి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల దాకా బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొని తెలంగాణలో గులాబీ పార్టీకి కమలమే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు ఇచ్చింది. కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకునేందుకే కొత్త కొత్త ప్రాజెక్టులుని తెరపైకి తీసుకువస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు గోదావరి జలాలను కృష్ణాలోకి తరలించి పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాలను ఏపీకి మళ్లిస్తారా అని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైనా బిజెపి తరచూ విమర్శలు ఎక్కు పెడుతోంది. కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు మరి కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోని బిజెపి నేతలు జగన్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. అక్రమకట్టడమని ప్రజావేదికను కూల్చడాన్ని తొందరపాటు చర్య అంటూ బీజేపీ విమర్శించింది. రాజధాని మార్పు వ్యవహారంపై వివాదం చెలరేగిన సమయంలో ఏపి, బీజేపీ అధ్యక్షుడు అమరావతిలో పర్యటించారు. పోలవరంపై రివర్స్ టెండరింగ్ పీపీఏల సమీక్షా పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పించాలన్న నిర్ణయాల పై కేంద్ర మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఏపీలో బీజేపీతో గ్యాప్ ఏర్పడినా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉండటం జగన్ కు ప్లస్ పాయింట్ గా మారింది. రాజకీయ అంశాలను పక్కన పెడితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఏర్పడింది. గతంలో ఏపీలో టిడిపి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య ఈ పరిస్థితి లేకపోవటంతో విభజన చట్టంలోని అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయి. హైదరాబాదు లో ఆస్తుల పంపిణీతో పాటు రెండు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కేంద్ర సంస్థల ఏర్పాటు లాంటి అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం సన్నిహిత సంబంధాలు ఉండటంతో కేంద్రం చొరవ చూపితే చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆస్తులూ, అప్పులూ పంపకాలూ ప్రక్రియని కొనసాగించే అంశాలు రెండు రాష్ట్రాల మధ్య వాయిదా అయిన నీటి పంపకాలు తదితర విషయాల పై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. మరి కేంద్రం ఈ అంశాల పై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.