English | Telugu
స్టేట్ లో జనసేనతో... సెంట్రల్ లో వైసీపీతో... బీజేపీ డబుల్ గేమ్..!
Updated : Feb 14, 2020
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసలు ఎవరు ఎవరితో జత కడుతున్నారో అర్ధంకాని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా బీజేపీ-జనసేన... బీజేపీ-వైసీపీ మధ్య సంబంధాల్లో పరస్పర విరుద్ధ భావజాలం కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనతో కలిసి కాపురం చేస్తోన్న బీజేపీ.... కేంద్రానికి వచ్చేసరికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. స్టేట్ లో కొట్టుకుంటున్న బీజేపీ, వైసీపీలు... ఢిల్లీలో మాత్రం ఒకరికొకరు స్నేహహస్తం చాచుకుంటున్నారు. ఇదే, ఇప్పుడు జనసేనానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది.
కలిసి పని చేయాలని, జగన్ ప్రభుత్వంపై ఉద్యమించాలని, జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకున్నాయి. కానీ ఇంతవరకూ ఉమ్మడి ఉద్యమం పట్టాలెక్కలేదు. మరోవైపు, బీజేపీ అధిష్టానం మాత్రం, సీఎం జగన్‌తోనూ, వైసీపీ ఎంపీలతోనూ క్లోజ్‌గా మూవ్ కావడం, వరుసగా జగన్ ఢిల్లీ పర్యటనలు, జనసేన అధినేతలో అనుమానపు బీజాలు నాటుతున్నాయంటున్నారు.
జగన్ అదేపనిగా ఢిల్లీకి వెళ్లడం ...ప్రధాని మోడీ అండ్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవడాన్ని పవన్ సహించలేకపోతున్నారట. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై పోరాడదామంటూనే, మరోవైపు అదే జగన్‌తో క్లోజ్‌గా మూవ్ అవడం అస్సలు అర్థంకావడం లేదని సేనాని అంటున్నారట. అయితే, పవన్‌ను బీజేపీ ఆటలో అరటి పండు చేస్తోందని జనసేన సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారట. దాంతో, అసలు ముందుముందు సంసార నావ సాగుతుందా...నడి సంద్రంలో మునిగిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.