English | Telugu

బీజేపీ క్యాండిడేట్ పై ఎమ్మెల్యే దాడి! రాజేంద్రనగర్ లో హై టెన్షన్ 

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి డివిజన్లను టీఆర్ఎస్, బీజేపీ సవాల్ గా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని, విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. మైలార్ దేవ్ పల్లి డివిజన్​ బీజేపీ క్యాండిడేట్​ తోకల శ్రీనివాస్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై టీఆర్ఎస్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ తో పాటు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.

డివిజన్​ పరిధిలోని హౌజింగ్​బోర్డు లో టీఆర్ఎస్​ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీజేపీ క్యాండిడేట్, కార్యకర్తలు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సమయంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్​ నేతలు దీనిపై ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. 200 మంది అనుచరులతో ఆ ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హల్చల్ చేశారు. బీజేపీ క్యాండిడేట్ తో పాటు అతని పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఎమ్మెల్యే దాడిలో తనకు, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని బీజేపీ క్యాండిడేట్​ తోకల శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్​ నేతలు డబ్బు పంచుతుండటంపై తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అక్కడికి వచ్చిన ఎస్సై మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్​ఎదుట ఆయన ధర్నాకు దిగారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మైలార్ దేవ్ పల్లికి చేరుకుని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆమె లోకల్ సీఐని ప్రశ్నించారు. పోలింగ్​ ప్రశాంతంగా సాగాలంటే.. ఎమ్మెల్యేను, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డీకే అరుణ డిమాండ్​ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈఘటనపై డీసీపీ కార్యాలయంలో కంప్లైంట్​ చేశామని బీజేపీ నేత స్వామిగౌడ్ తెలిపారు.