English | Telugu

ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీజేపీ కార్యకర్త మృతి.. అంతిమ యాత్రలో పాల్గొననున్న బండి సంజయ్

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంలో జరిగిన ఘటనలలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా నవంబర్‌1న హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌ ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ స్వస్థలం ఐన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, తుమ్మలోనిగూడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్ది సేపట్లో శ్రీనివాస్‌యాదవ్ అంతిమయాత్ర జరగనుంది. శ్రీనివాస్ మృతి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం తనన్నెంతగానో బాధిస్తోందని అన్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ అంతిమయాత్రలో బండి సంజయ్‌ స్వయంగా పాల్గొననున్నారు. శ్రీనివాస్‌యాదవ్ కాలిన గాయాలతో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భారీ భద్రత మధ్య ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి చేశారు.

నవంబర్‌1 ఆదివారం శ్రీనివాస్‌ యాదవ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అదే రోజు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి మార్చారు. అయితే శరీరం 60 శాతంపైగా కాలిపోవడంతో శ్రీనివాస్‌ కోలుకోవడం కష్టమైంది. అతనిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.