English | Telugu

ఐతే చర్చలు.. లేదంటే మిలట్రీ యాక్షన్.. చైనాకు బిపిన్ రావత్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ చైనా ల మధ్య సరిహద్దు వివాదం చైనా మొండి వైఖరి తో ఇంకా జఠిలమవుతున్నట్లుగా తెలుస్తోంది. సరిహద్దు వివాదం పరిష్కారం కోసం రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలలో చిక్కుముడి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో ముఖ్యంగా ప్యాంగ్యాంగ్ సరసు వద్ద ఉన్న ఫింగర్స్ ప్రాంతంలో సైనిక బలగాల ఉపసంహరణ పై ప్రతిష్టంభన ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో చైనా సైన్యం అతిక్రమణలను ఎదుర్కోడానికి చర్చల ద్వారా తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఒకవేళ అవి సఫలం కాకపోతే మాత్రం మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగానే ఉందని భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం దీనికి శాంతియుతంగానే పరిష్కారం కోరుతోందని, అయితే చర్చలు ఫలించకపోతే మాత్రం ఆర్మీని రంగంలోకి దింపడానికి, యుద్ధానికి కూడా సిద్ధమని అయన చెప్పారు. అయితే ఈ విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు భారత్ చైనా కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. అయితే ఏప్రిల్‌కి ముందు ఉన్న యథాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతుండగా చైనా సైన్యం మాత్రం ససేమిరా అంటుండడంతో భారత్‌ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.